prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 5:22 pm Digital Edition : PRAJA KSHETRAM

అంతారం గేట్ వద్ద టిప్పర్ లారీ అగ్నిప్రమాదం

అంతారం గేట్ వద్ద టిప్పర్ లారీ అగ్నిప్రమాదం

  • ఇంజన్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు – డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెద్ద ప్రమాదం

షాబాద్ ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):షాద్‌నగర్ నుండి షాబాద్ వైపు కంకర లోడుతో వస్తున్న టిప్పర్ లారీ అంతారం గేట్ సమీపంలో అగ్నికి ఆహుతైన ఘటన కలకలం రేపింది. మధ్యాహ్నం సుమారు 12:15 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం, షాద్‌నగర్ నుంచి బయలుదేరిన టిప్పర్ లారీ షాబాద్ మండల పరిధిలోని అంతారం గేట్ వద్దకు చేరుకున్న సమయంలో లారీ ఇంజన్ భాగంలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. క్యాబిన్‌లో పొగ రావడం గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వాహనాన్ని రోడ్డుపక్కకు నిలిపివేశాడు. అయితే కొద్ది నిమిషాల్లోనే మంటలు వేగంగా వ్యాపించి లారీ మొత్తం దగ్ధమైంది. డ్రైవర్ స్పందించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే షాబాద్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో లారీ టైర్లు, ఇంజన్ భాగం పూర్తిగా ధ్వంసమయ్యాయి. అగ్నిప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు పరిస్థితిని చక్కదిద్దుతూ వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.