prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 5:41 pm Digital Edition : PRAJA KSHETRAM

అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో టోర్నడో తరహా సుడిగాలి…!

అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో టోర్నడో తరహా సుడిగాలి…!

-అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో భారీ గాలి దుమారం

-20 మీటర్ల ఎత్తుకు ఎగిసిన దుమ్ము, ధూళి

-భయంతో పరుగులు తీసిన జనం.. వైరల్ అయిన వీడియోలు

-భూమి వేడెక్కడమే కారణమంటున్న వాతావరణ నిపుణులు

అనకాపల్లి ఫిబ్రవరి 16(ప్రజాక్షేత్రం):పట్టణంలో అరుదైన, భారీ గాలి దుమారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఎన్టీఆర్ స్టేడియం వద్ద హఠాత్తుగా ఏర్పడిన ఈ సుడిగాలి సుమారు 20 మీటర్ల ఎత్తుకు చేరి, భయానక వాతావరణాన్ని సృష్టించింది. టోర్నడో తరహాలో బలమైన గాలులతో కూడిన ఈ సుడిగుండం స్టేడియంలోని దుమ్ము, ధూళి, చెత్తాచెదారాన్ని ఆకాశంలోకి ఎగరవేసింది. దీంతో ఆ ప్రాంతమంతా క్షణాల్లో ధూళి మేఘంలా మారిపోయింది. ఈ ఊహించని పరిణామాన్ని చూసిన స్థానికులు, క్రీడాకారులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఆ వీడియోలు వేగంగా వైరల్ అయ్యాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై వాతావరణ నిపుణులు స్పందించారు. భూమి ఉపరితలం తీవ్రంగా వేడెక్కడం వల్ల పీడనం పెరిగి, గాలి వేగంగా పైకి లేచి సుడులు తిరుగుతుందని వివరించారు. సూర్యరశ్మి తీవ్రత, గాలి పీడనంలో మార్పుల వల్లే ఇలాంటి దుమారాలు ఏర్పడతాయని తెలిపారు.