prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 7:13 pm Digital Edition : PRAJA KSHETRAM

ఇప్పటికైన నెరవేరుస్తారా!?

ఇప్పటికైన నెరవేరుస్తారా!?

– మహిళలకు 2500 రూపాయిలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం

– పెన్షన్ పెంపుకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను అమలు చేస్తోంది. అయితే, మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చే  మహాలక్ష్మి నగదు బదిలీ, వృద్ధాప్య పింఛన్ల పెంపు  రూ. 4000 వంటి భారీ ఖర్చుతో కూడిన పథకాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటికి తోడు రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేల పంపిణీకి అవసరమైన వేల కోట్ల నిధుల సమీకరణ ఆర్థిక శాఖకు సవాల్‌గా మారింది. ఆదాయ వనరులు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో, సంక్షేమ పథకాల భారాన్ని మోయడం ఖజానాకు తలకు మించిన భారమే అవుతోంది. రాష్ట్ర ఆదాయం ప్రధానంగా జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల ద్వారా వస్తున్నప్పటికీ.. హామీల అమలుకు అవసరమైన అదనపు నిధుల కోసం ప్రభుత్వం అప్పులపైనే ఎక్కువగా ఆధారపడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం రోజువారీ ఖర్చులు, జీతాలు, పాత అప్పుల వడ్డీలకే పెద్ద మొత్తంలో నిధులు ఖర్చవుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ కొత్తగా బహిరంగ మార్కెట్ నుండి రూ. 60 వేల కోట్లకు పైగా అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఒక రకంగా  అప్పులతోనే అభివృద్ధి  అన్నట్లుగా మారుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయినా ప్రభుత్వానికి మరో ఆప్షన్ లేకుండా పోయింది.

హామీల పై ప్రతిపక్షాలు ధ్వజం

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది.  అధికారంలోకి వచ్చి రెండు బడ్జెట్లు గడిచినా 95 శాతం హామీలు అమలు కాలేదు  అంటూ కేటీఆర్ బహిరంగ లేఖలు రాస్తున్నారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సాయంపై ఈ బడ్జెట్‌లో స్పష్టమైన కేటాయింపులు లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, ఈసారి బడ్జెట్‌లో సామాజిక మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూనే, నిధుల కొరత లేకుండా జాగ్రత్త పడాలని ప్రభుత్వం భావిస్తోంది.