prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 6:06 pm Digital Edition : PRAJA KSHETRAM

తెలంగాణ మత్స్య శాఖలో భారీ దోపిడీ?

తెలంగాణ మత్స్య శాఖలో భారీ దోపిడీ?

తెలంగాణ రాష్ట్రం చేపల పెంపకంలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. 2022-23లో చేపల ఉత్పత్తి విలువ రూ.6,191 కోట్లకు చేరుకోవడం, 2016-17లోని రూ.2,111 కోట్ల నుండి 193 శాతం పెరుగుదలను సూచిస్తుంది. పరిమాణంలోనూ 1,93,732 టన్నుల నుండి 4,24,327 టన్నులకు పెరిగింది. డైరెక్టరేట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్ నివేదిక ప్రకారం, ఇది 119 శాతం పెరుగుదల. రాష్ట్రంలో 5.73 లక్షల చదరపు కిలోమీటర్ల నీటి వనరులు ఉండటం, దేశంలో మూడవ అతిపెద్ద అంతర్గత జలాల విస్తరణగా నిలవడం ఈ విజయానికి బలమైన ఆధారం. అయితే, ఈ “నీలి విప్లవం” నీడలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న అవినీతి, దళారీ వ్యవస్థ, ప్రభుత్వ అధికారుల వైఫల్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. లక్షలాది మత్స్యకారులు ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి బలి అవుతున్నారు.

తెలంగాణలో మత్స్యకారుల జనాభా సుమారు 27.14 లక్షల మంది ఉన్నట్లు అధికారిక డేటా చూపిస్తోంది. 2014 సమగ్ర కుటుంబ సర్వే (ఎస్ కె ఎస్)లో మత్స్యకార కుటుంబాలు 40 లక్షలు గా నమోదైనప్పటికీ, మొత్తం జనాభా 27 లక్షలకు మించి ఉండవచ్చు. కానీ, అధికారికంగా గుర్తించబడిన సభ్యత్వాల సంఖ్య కేవలం 3,50,168 మాత్రమే. మిగిలిన దాదాపు 23 లక్షల మంది సంక్షేమ పథకాలకు అనర్హులుగా మిగిలిపోతున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి స్పష్టమైన ఉదాహరణ. సభ్యత్వం లేకుండా, ప్రమాద బీమా, సబ్సిడీలు, రుణాలు, పనిముట్లు వంటి సౌకర్యాలు అందకుండా పోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, సభ్యత్వానికి రూ.10 నుండి రూ.100 మాత్రమే ఖర్చు. కానీ, దళారులు, రాజకీయ నాయకులు, అధికారులు కలిసి ఒక్కొక్క సభ్యత్వానికి రూ.10,000 నుండి రూ.1 లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ముదిరాజు కులంలోని కొందరు రాజకీయ నాయకులు ఈ దోపిడీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ, మండల స్థాయిలో సామాన్య మత్స్యకారులు ఈ మోసానికి గురవుతున్నారు.

నిధుల కేటాయింపు మరియు దుర్వినియోగం ఈ సమస్యలకు మూలం. 2015లో తెలంగాణ స్టేట్ ఫిషర్మన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ ఏర్పాటైంది. 2014-2025 మధ్యకాలంలో మత్స్యకారుల అభివృద్ధి, సబ్సిడీలు, రుణాల కోసం రూ.458 కోట్లు కేటాయించగా, ఇందులో రూ.223 కోట్లు రాష్ట్రానికి విడుదలయ్యాయి. అలాగే 2017-18లో ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ స్కీమ్ (ఐ ఎఫ్ డి ఎస్) కింద నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ సి డి సి) ద్వారా రూ.1,000 కోట్ల నిధులను తెలంగాణ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించబడ్డాయి. ఇవి చిన్న, మధ్యతరహా రిజర్వాయర్ల అభివృద్ధి, కేజ్ కల్చర్, చేపల-రొయ్యల పెంపకం, 24,189 చెరువుల అభివృద్ధికి ఉపయోగపడాల్సి ఉంది. అలాగే, 2016-2026 మధ్య చేపపిల్లల పంపిణీ, మత్స్యకారుల జీవన ప్రమాణాల పెంపు కోసం , చేప పిల్లల పంపిణీ కోసం రూ.700 కోట్లు కేటాయించబడ్డాయి. ఈ నిధులు జిల్లాల వారీగా పంపిణీ చేయబడ్డాయి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పి ఎం ఎం ఎస్ వై) కింద 2020-25 మధ్య రూ.1,968 కోట్ల ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి, కేంద్ర వాటా రూ.681 కోట్లు.

కానీ, ఈ నిధులు మత్స్యకారుల వరకు చేరడం లేదు. మత్స్యశాఖ వద్ద 2016 నుండి 2026 వరకు ఎన్ని చెరువులకు చేపపిల్లలు పంపిణీ చేశారనే స్పష్టమైన డేటా లేదు. ఎందుకు ఖర్చు పెట్టారో, ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధుల ద్వారా ఎంత మంది మత్స్యకారులు లబ్ధి పొందారో ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో 8 నుండి 22 సెం.మీ పొడవు ఉన్న చేపలను పంపిణీ చేయాలి. కానీ, దళారులు రాజకీయ నాయకులతో చేతులు కలిపి 3-5 సెం.మీ సైజ్ కలిగిన చేపపిల్లలను, అందులోనూ నాసిరకం చేపపిల్లలు వదిలి, అధిక నాణ్యత చూపించి తప్పుడు బిల్లులు తయారు చేస్తున్నారు. కొన్ని చోట్ల చేపపిల్లలు వదలకుండానే బిల్లులు తీసుకుంటున్నారు. తక్కువ సంఖ్యలో వదిలి, ఎక్కువ చూపించి నిధులు దోచుకుంటున్నారు. ఉదాహరణకు, 2017-18లో రూ.44.6 కోట్లతో 51.08 కోట్ల చేపపిల్లలు విడుదల చేసినట్లు చూపించి, 2.62 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించారు. 2022-23లో రూ.62.79 కోట్లతో 77.14 కోట్ల చేపపిల్లలు విడుదల చేసినట్లు రికార్డు. కానీ, ఈ పంపిణీలో అవినీతి ప్రబలంగా ఉంది. కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకులు, దళారులు కలిసి ఒక వ్యవస్థగా మారి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు.

గత BRS పాలనలో ఈ దోపిడీ మరింత పెరిగింది. 2015లో ఏర్పాటైన ఫెడరేషన్‌ను రాజకీయ నాయకులు, ఉద్యోగులు, దళారులు దోచుకున్నారు. స్వార్థం కోసం అమాయక మత్స్యకారులను బలి చేశారు. దళారీ వ్యవస్థను పెంచి పోషించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మౌనం వహిస్తోంది. 2021లో కోకాపేట ముదిరాజ్ సంఘం భవన భూమి పూజలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, ఈటెల రాజేందర్ 18 ఏళ్లు నిండిన ప్రతి మత్స్యకారుడికి సభ్యత్వాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, నాలుగు సంవత్సరాలు గడిచినా ఎటువంటి చర్యలు లేవు.

బీమా సమస్యలు మరింత దారుణం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పి ఎం ఎం ఎస్ వై) కింద బీమా అందాల్సి ఉంది. కానీ, ఆర్ టి ఐ సమాచారం ప్రకారం, 2019-2025 మధ్య 1,475 మంది మత్స్యకారులు మరణించగా, కేవలం 804 మందికే బీమా అందింది. మిగిలిన 671 కుటుంబాలు నిబంధనల సాకుతో ఎదురుచూస్తున్నాయి. ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ రిపోర్టులు వంటి పదుల పత్రాలు అడుగుతున్నారు. నిరక్షరాస్యులైన పేదలకు ఇది అసాధ్యం. మత్స్యశాఖలో నిధుల కొరత, రాజకీయ నాయకులకు అవగాహన లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ శాఖ విస్మరణకు గురవుతోంది. ఇటీవలి అవినీతి కేసుల్లో నల్గొండ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ రూ.20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. సూర్యాపేట డిఎఫ్ఓ రూ.25,000 లంచం కేసులో అరెస్ట్ అయ్యారు. గతంలో గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో అవినీతి ఆరోపణలు వచ్చాయి.

పరిష్కారాలు అత్యవసరం. సభ్యత్వాలను ఉచితంగా ఇవ్వాలి, బీమాను సరళీకరించాలి (రైతు బీమా తరహా), సమగ్ర జీవిత బీమా అమలు చేయాలి, ఎన్ ఎఫ్ డి బి ద్వారా పూచీకత్తు లేని రుణాలు అందించాలి, ప్రతి మత్స్యకారునికి గుర్తింపు కార్డు ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిని అరికట్టి, నిధులు సరిగా చేరేలా చర్యలు తీసుకోవాలి. ఇంకా ఆలస్యమైతే, మత్స్యకారుల బతుకులు మరింత దయనీయమవుతాయి. నీటిపై పోరాడే వీరికి న్యాయం చేయాల్సిన సమయం ఇది.

డాక్టర్.వై. శివ ముదిరాజ్
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు,
ఆల్ ఇండియా ఒబిసి స్టూడెంట్స్ అసోసియేషన్
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ
ఫోన్ నెంబర్: 9963240519