prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 8:43 am Digital Edition : PRAJA KSHETRAM

త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

  • ఈ రోజు అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ.. స్పష్టత ఇచ్చే అవకాశం
  • ఒకే విడతలో పోలింగ్‌.. 15-20 రోజుల్లో ప్రక్రియ పూర్తికి కసరత్తు
  • బడ్జెట్ సెషన్స్, పరీక్షల షెడ్యూల్‌కు తగ్గట్టుగా నిర్ణయం!

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో నిర్వహించనున్న సమీక్షా సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ భేటీ తర్వాత ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.

మున్సిపల్ ఎన్నికల జోష్‌తో అత్యంత వేగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే మొత్తం ప్రక్రియను ముగించేలా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నది. దీనివల్ల యంత్రాంగంపై భారం తగ్గడమే కాకుండా, త్వరగా పాలనపై దృష్టి పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఎన్నికల నిర్వహణపై చర్చ

రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణ సాధ్యసాధ్యాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. పరీక్షలకు ఆటంకం కలగకుండా పోలింగ్ తేదీలను ఎలా ఖరారు చేయాలనే అంశంపై విద్యాశాఖ, ఎన్నికల సంఘం అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమాలోచన చేయనున్నారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎన్నికల నిర్వహణ ఇప్పుడా? లేదా? పరీక్షల తర్వాత అనేది ఖరారు కానున్నది. ఇంటర్మీడియెట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలు మార్చి 11 నుంచి ఏప్రిల్ 2 వరకు షెడ్యూల్ అయ్యాయి. అదే సమయంలో మార్చి రెండో వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 538 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గత పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఈ స్థానాలన్నీ అధికారుల పాలనలో ఉన్నాయి. వీటిని త్వరగా మార్చిలోపు భర్తీ చేస్తే స్థానిక సంస్థలకు పెండింగ్‌లో ఉన్న 500 కోట్ల రూపాయలపైన 15 వ ఆర్థిక సంఘం నిధులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్‌ చేస్తున్నది.