prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 6:37 pm Digital Edition : PRAJA KSHETRAM

దళితుల్ని గుళ్లోకి రాకుండా అడ్డుకున్న వ్యక్తి..!

దళితుల్ని గుళ్లోకి రాకుండా అడ్డుకున్న వ్యక్తి..!

-కర్ణాటకలో నవ దంపతులకు గుడిలో ఘోర అవమానం

-దళితులు గుడిలోకి రావొద్దంటూ అడ్డుకున్న వ్యక్తి

-పోలీసులకు ఫిర్యాదు చేసిన నవదంపతులు

-గ్రామంలో శాంతికమిటీ సమావేశం నిర్వహించిన డీఎస్పీ

కర్ణాటక ఫిబ్రవరి 24(ప్రజాక్షేత్రం):దేశం డిజిటల్ యుగంలో దూసుకుపోతున్నా, కొన్ని గ్రామాల్లో కుల వివక్ష ఇంకా వేళ్లూనుకునే ఉంది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా తురువేకెరె తాలూకాలోని గోణి గ్రామంలో ఒక దళిత నవ దంపతులకు ఎదురైన అనుభవం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అసలేం జరిగిందంటే..

కొత్తగా పెళ్లయిన జగదీష్, పంకజ జంటగా దైవ దర్శనం కోసం గ్రామంలోని అరసమ్మ ఆలయానికి వెళ్లారు. వారు గుడిలోకి ప్రవేశించగానే అక్కడున్న నారాయణప్ప అనే వ్యక్తి ఒక్కసారిగా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనను దేవుడు ఆవహించినట్టు (శివం పూనడం) నటిస్తూ, దళిత కుటుంబం గుడిలోకి రావడానికి వీల్లేదని అడ్డుకున్నాడు. నారాయణప్ప మోకాళ్లపై కూర్చుని గర్భాలయానికి వెళ్లే దారిని అడ్డుకోవడమే కాకుండా.. ‘‘దళితులకు ఇక్కడ ప్రవేశం లేదు, మీరు బయటకు వెళ్లండి.. కావాలంటే ఇంట్లోనే పూజలు చేసుకోండి’’ అంటూ భార్యాభర్తలపై గట్టిగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న మరికొందరు గ్రామస్థులు కూడా దంపతులకు మద్దతుగా నిలవకపోవడం గమనార్హం.

పోలీసులకు ఫిర్యాదు..

జగదీష్ వెంటనే తురువేకెరె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితుడు నారాయణప్పను అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నారాయణప్పతో పాటు ప్రభ, కాంతన్న, అమూల్య, పుట్టెగౌడ, పద్మ అనే వ్యక్తులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. తహసీల్దార్ మరియు డిఎస్పీ ఆధ్వర్యంలో గ్రామంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించి, అంటరానితనం నేరమని గ్రామస్థులకు అవగాహన కల్పించారు.