– నిర్లక్ష్యానికి నిదర్శనం–గాగిల్లాపూర్ మ్యాన్‌హోల్ వివాదం
– ఫిర్యాదులు విన్నా విననట్టేనా?దుండిగల్ సర్కిల్‌పై ప్రజల ఆగ్రహం
– తెరిచి ఉన్న మ్యాన్‌హోల్…దుండిగల్ సర్కిల్ నిర్లక్ష్యానికి నిదర్శనం!
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):దుండిగల్ సర్కిల్ గాగిల్లాపూర్ ఫస్ట్ వార్డ్ మెయిన్ రోడ్‌లో డ్రైనేజీ సమస్య తీవ్ర రూపం దాల్చింది. డ్రైనేజీ నీరు సక్రమంగా పోవడం లేదని మ్యాన్‌హోల్‌ను తెరిచి ఉంచడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా వీధి దీపాలు పనిచేయకపోవడంతో రాత్రి సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. చిన్నారులు ఆడుకుంటూ వెళ్లే సమయంలో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడే ప్రమాదం ఉందని కాలనీ వాసులు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?” అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌ను మూసివేసి, డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని గాగిల్లాపూర్ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అమాయకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లక ముందే తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.