prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 7:03 pm Digital Edition : PRAJA KSHETRAM

ఫార్ములా ఈ రేసు కేసు.. సీనియర్ ఐఏఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు?

ఫార్ములా ఈ రేసు కేసు.. సీనియర్ ఐఏఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు?

హైదరాబాద్ ఫిబ్రవరి 28(ప్రజాక్షేత్రం):ఫార్ములా ఈ రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను బదిలీ చేస్తూ, ఎక్కడా కొత్త పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచింది. రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ క్రమంలో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంబంధిత దస్త్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారని, నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అర్వింద్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) ఫిబ్రవరి మధ్యలో అనుమతినిచ్చింది. ఈ అనుమతి లభించిన కొన్ని రోజులకే రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అర్వింద్ కుమార్ ఉన్నారు. ఆ సమయంలోనే ఫార్ములా ఈ రేసు కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నుంచి దాదాపు రూ.55 కోట్లను రాష్ట్ర కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా బదిలీ చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ-1గా, అర్వింద్ కుమార్‌ను ఏ-2గా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. కేంద్రం నుంచి ప్రాసిక్యూషన్‌కు అనుమతులు రావడంతో, ఏసీబీ త్వరలోనే ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగానే అర్వింద్ కుమార్‌ను పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేయడం, సస్పెన్షన్ వేటుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.