prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 4:17 am Digital Edition : PRAJA KSHETRAM

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు – రూ.5 వేల లంచం తీసుకుంటూ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు – రూ.5 వేల లంచం తీసుకుంటూ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు

భూపాలపల్లి ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):జిల్లాలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అధికారులకు మరో విజయం లభించింది. జిల్లా కోర్టులో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది రూ.5 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఫిర్యాదుదారుడు ఒక కేసుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని కోరగా, అందుకు కోర్టు సిబ్బంది లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా, వారు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని తనిఖీలు నిర్వహించారు. దాడుల సమయంలో స్టెనోగ్రాఫర్ సాయి చరణ్‌తో పాటు సిబ్బంది పున్నం రజిత, కొమ్ము సునీతలు రూ.5 వేల లంచం స్వీకరిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని ఏ విధంగానూ సహించబోమని, ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ ఘటనతో జిల్లా కోర్టు వర్గాల్లో కలకలం రేగింది. ప్రజలకు న్యాయం అందించే వ్యవస్థలోనే అవినీతి బయటపడడం పట్ల న్యాయవాదులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.