హిందువుల ఐక్యతే సమాజ బలం అంటూ సందేశం
- సాయి దామంలో బజరంగ్ దళ్ శిక్షణ వర్గ ఏర్పాట్లపై సమీక్ష
- కుషాయిగూడ, ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని సాయి దామంలో మార్చి 7 నుంచి 14 వరకు నిర్వహించనున్న అఖిలభారత బజరంగ్ దళ్ శిక్షణ వర్గ ఏర్పాట్లపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా అఖిలభారత బజరంగ్ దళ్ జాతీయ అధ్యక్షుడు కిషన్ ప్రజాపతి కుషాయిగూడకు విచ్చేసి శిబిర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కుషాయిగూడ బస్ స్టాప్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం కుషాయిగూడ శివాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ యువత ధర్మ మార్గంలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ‘లవ్ జిహాద్’ పేరుతో జరుగుతున్న సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హిందువులను కులాలవారీగా విభజించి ఐక్యతను దెబ్బతీయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ, సమాజ బలానికి హిందువుల ఐక్యతే మూలమన్నారు.
కార్యక్రమంలో దక్షిణ భారత్ బజరంగ్ దళ్ సంయోజక్ కుమారస్వామి, తెలంగాణ విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షులు రమేష్ బాబు, రాష్ట్ర బజరంగ్ దళ్ సంయోజక్ శ్రీకాంత్, భాగ్యనగర్ సంయోజక్ విశాల్, కుషాయిగూడ ప్రఖండ ప్రముఖ సాకేత్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.