prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 11:32 am Digital Edition : PRAJA KSHETRAM

ఆస్తి రాసిస్తే.. అనాథను చేశాడు

ఆస్తి రాసిస్తే.. అనాథను చేశాడు

కన్న కొడుకు చేసిన పనికి కలెక్టర్‌కు తల్లి ఫిర్యాదు

వికారాబాద్ బ్యూరో 30(ప్రజాక్షేత్రం):కన్న కొడుకే తల్లిని రోడ్డు పాలు చేశాడు. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచిన కనికరం లేకుండా, ఆస్తిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఆపై గంజి నీళ్లు కూడా పోయకుండా అమానుషంగా ఇంటి నుండి గెంటేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. బొంరాస్పేట్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పద్మమ్మకు ఉన్న ఒక ఎకరం భూమిని తన ఒక్కగానొక్క కొడుకు పేరిట రిజిస్ట్రేషన్ చేయించింది. అయితే ఆస్తి చేతికి రాగానే కొడుకు అసలు స్వరూపం బయటపెట్టాడు. తల్లిని కనీసం మనిషిగా కూడా చూడకుండా, తిండి పెట్టకపోగా ఇల్లు వదిలి వెళ్లాలని వేధించడం మొదలుపెట్టాడు. చివరకు ఆమెను ఇంటి నుండి బయటకు గెంటేయడంతో, దిక్కుతోచని స్థితిలో పద్మమ్మ ప్రస్తుతం తన కూతురు వద్ద ఆశ్రయం పొందుతోంది.వయసు మళ్ళిన తరుణంలో కొడుకు చేసిన అన్యాయాన్ని భరించలేక పద్మమ్మ సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుంది. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకుంది. “ఆస్తి తీసుకుని నన్ను అనాథను చేశాడు, నా భూమి నాకు ఇప్పించి, కొడుకుపై చర్యలు తీసుకోవాలి” అని కన్నీటి పర్యంతమైంది. వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం పద్మమ్మకు న్యాయం చేస్తామని, ఆస్తి రిజిస్ట్రేషన్ రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.