ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్ తప్పదా…?
పౌల్ట్రీ కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో చికెన్ వ్యాపారులు ఆందోళనకు దిగుతున్నారు. తక్కువ మార్జిన్ కారణంగా నష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేయాలని నిర్ణయించారు. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవడం లేదని వ్యాపారులు తీవ్ర ఆవేదన లో ఉన్నారు. వ్యాపారం నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.చికెన్ ధరలు పెరిగినా, మధ్యవర్తుల విధానాల వల్ల తాము లాభపడడం లేదని వ్యాపారులు అంటున్నారు. తమ సమస్యలను పౌల్ట్రీ కంపెనీలకు పలుమార్లు తెలియజేసినా, సరైన స్పందన రాలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా చికెన్ షాపులను మూసివేస్తామని హెచ్చరించారు. చికెన్ షాపుల బంద్ వల్ల వినియోగదారులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని, ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించాలని వ్యాపారులు కోరుతున్నందున పౌల్ట్రీ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనం….
పౌల్ట్రీ రంగంలో తెలుగు రాష్ట్రాలది తిరుగులేని స్థాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో ముందుండేది. రాష్ట్ర విభజన తర్వాత గుడ్లు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉంటే, తెలంగాణ తృతీయ స్థానంలో ఉంది.కోడి మాంసం ఉత్పత్తలో ఏపీ మూడో స్థానంలో ఉంటే తెలంగాణ టాప్ 7లో నిలుస్తోంది.
2025 నాటి కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం పౌల్ట్రీలో అత్యధిక పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాల్లో కూడా ఏపీ, తెలంగాణ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. పౌల్ట్రీ ఉత్పత్తుల్లో ముందంజలో నిలవడంతో ఈ రంగంలో లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. మొత్తంగా ఉభయ రాష్ట్రాల్లో 10 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ పరిస్థితి మారుతోంది. ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమ తిరగోమనం బాట పడుతోంది. వందల కొద్దీ పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఇప్పటికే చిన్న, మధ్య తరహా పౌల్ట్రీ యూనిట్లు వేలాదిగా మూసివేశారు. మరిన్ని అదే బాటలో ఉన్నాయని యజమానులు చెబుతున్నారు.
గుడ్లు, కోడి మాంసం ఉత్పత్తిలో తెలుగు నేలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2025 నాటి అధికారిక సమాచారం ప్రకారం దేశంలో ఉత్పత్తి అయ్యే గుడ్లలో ఒక్క ఏపీనే 23.45 శాతం ఉత్పత్తి చేస్తోంది. తెలంగాణలో 14.98 శాతం గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ మొత్తం కోడిగుడ్లలో 20 శాతం మాత్రమే స్థానిక అవసరాలకు వినియోగించగా, 80 శాతం ఎగుమతులు అయ్యేవి.
తెలంగాణలో రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పెద్ద స్థాయిలో పౌల్ట్రీ యూనిట్లు వెలిశాయి.
ఉత్పత్తి ఖర్చుకు – మార్కెట్ ధరకి పొంతన లేదు..
రాములు కోళ్ల ఫారం యజమాని
సగటున 10 వేల కోళ్లు పెంచితే 8.7 వేల గుడ్లు వస్తాయి. చలికాలంలో ఎక్కువగా, వేసవిలో తక్కువగా గుడ్లు పెడతాయి. కోడికి 120 గ్రాముల దాణా వేయాలి. మార్కెట్‌లో ప్రస్తుత ధరల ప్రకారం మేతకి రూ. 30 వేలు ఖర్చవుతుంది. కూలీల ఖర్చు, కరెంటు బిల్లు, ఫారం అద్దె కలిపితే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది. నెక్ నిర్ణయించిన ధరల ప్రకారం గుడ్డు రూ. 4.05 రూ ఉంటే, రైతుకి దక్కేది రూ. 3.8 మాత్రమే. దళారుల పాత్ర పెరిగింది. నెక్ పేరుకే కోళ్ల ఫారం నిర్వాహకుల సంస్థ. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా సాగుతోంది” అంటూ ఆయన వాపోయారు.కోడి మేత ధర గతంలో రూ. 16 నుంచి 18 మధ్య ఉంటే ప్రస్తుతం అది రూ. 26 నుంచి 28 మధ్య ఉంటోందని తెలిపారు. కానీ కోడిగుడ్డు ధర గతంతో పోలిస్తే తగ్గిపోతోందని చెప్పారు.
గుడ్డుతో పాటుగా కోడి ద్వారా వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రమేనని రాములు అన్నారు. కిలోకి రూ. 58 కి మించి రాదని, దానివల్ల కూడా నష్టపోవాల్సి వస్తుంది అన్నారు. కోళ్ల పరిశ్రమలో గుడ్లు ఉత్పత్తి కోసమే కాకుండా, బ్రాయిలర్ వంటి మాంసం కోసం సిద్ధం చేసే కోళ్లను కూడా పెంచుతారు. ప్రస్తుతం మార్కెట్లో ఎగుమతుల విషయంలో వచ్చిన సమస్యల కారణంగా ధరలు తగ్గిపోతున్నాయన్నారు.
ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలు ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడేవి. మన ప్రాంతం నుంచి ఆ రాష్ట్రాలకు నిత్యం వందల లారీల ద్వారా ఎగుమతులు జరిగేవి. కానీ ప్రస్తుతం అక్కడి ప్రభుత్వాలు రాయితీలు పెంచాయి. దాంతో స్థానికంగా ఉత్పత్తి చేసే యూనిట్లు పెరుగుతున్నాయి. ఇది మన ఎగుమతులు తగ్గిపోవడానికి కారణమవుతోంది. అదే సమయంలో ధరల విషయంలో సమస్య ఏర్పడుతోంది. పౌల్ట్రీలో నిల్వ ఉంచడం సాధ్యం కాదు కాబట్టి ఎగుమతులకు కొత్త మార్కెట్ల వైపు చూడాలి. కానీ ధరల విషయంలో స్థిరత్వం లేకపోతే కష్టమే” అంటూ పౌల్ట్రీ వ్యాపారుల అధ్యక్షులు బలవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పౌల్ట్రీ ఉత్పత్తుల మార్కెట్, ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తాము పలుమార్లు విన్నవించినా ఆశించిన ఫలితం దక్కలేదని ఆయన వాపోయారు.
ఉత్పత్తి వ్యయం పెరిగింది.
దేశవ్యాప్తంగా సగటున గుడ్డు వినియోగం పెరిగింది. అనేక ప్రచార కార్యక్రమాలు, ముఖ్యంగా కరోనా సమయంలో ప్రోటీన్ అవసరాల పేరుతో గుడ్డు తినేవారి సంఖ్య పెరిగింది. 2012 నాటికి సగటున భారతీయులు ఏడాదికి 62 గుడ్లు తింటే ప్రస్తుతం అది 50 శాతం పెరిగింది. 96 గుడ్లు చొప్పున సగటున తీసుకుంటున్నారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. అంటే వినియోగం పెరిగింది.
దానికి తగ్గట్టుగానే మార్కెట్ కూడా విస్తరించింది. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో గుడ్డు ధరలతో పోలిస్తే ఉత్పత్తి వ్యయం ఎక్కువయ్యిందని రైతులు అంటున్నారు. రవాణా, ఇతర ఖర్చులు కలుపుకుంటే వ్యయం ఇంకా పెరుగుతుందని.. రూ. 4 కి గుడ్లు అమ్మడం అంటే నష్టపోతున్నట్టేనని అన్నారు.
“గుడ్డు తయారీ ఖర్చు పెరిగింది. మేత కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. మొక్కజొన్న, సోయాబీన్, నూకల ఖర్చు బాగా పెరిగింది. కానీ రాయితీ ధరల మీద వాటిని సరఫరా చేయడం లేదు. దాంతో బహిరంగ మార్కెట్లో వాటిని కొని, కోళ్లు పెంచి, గుడ్లు ఉత్పత్తి చేసిన తర్వాత మార్కెట్ లో రేట్ లేనప్పుడు ఫారం నష్టాల్లో చిక్కుకుంటోంది. అందుకే ఎక్కువ మంది కోళ్ల ఫారాలు మూసేస్తున్నారు. మా మండలంలోనే పెద్ద కోళ్ల ఫారాల నుంచి చిన్న ఫారాల వరకూ 30కి పైగా మూతపడ్డాయి. అలా మూతపడుతున్నవి రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి” అంటూ ఆయన వివరించారు. గుడ్డు రేటు బహిరంగమార్కట్లో రూ. 6 దాటిన దశ నుంచి ప్రస్తుతం రూ. 5 లోపుకు వచ్చేసింది. దాంతో ఖర్చులు పెరుగుతుండగా, రాబడి తగ్గుతోందని సుబ్బారెడ్డి వివరించారు.
వేసవి కష్టాలు తోడై.
ఏడాదిన్నర కాలంగా పౌల్ట్రీ పరిశ్రమ ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. మొక్కజొన్న, సోయాబీన్‌తో పాటుగా స్థానికంగా లభించే నూకలు కూడా ఎక్కువగా ఎగుమతి అవుతుండడం వల్ల స్థానిక మార్కెట్లో ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. ఇది పౌల్ట్రీ యజమానులకు పెనుభారం అవుతోంది. అదే సమయంలో వాతావరణ మార్పులు కూడా పౌల్ట్రీ నిర్వహణకు పెను భారం అవుతున్నాయి. సహజంగా ఏటా వేసవి ఆరంభంలో చికెన్, గుడ్లు ధరలు తగ్గుతూ ఉంటాయి. కానీ ఈసారి అసాధారణంగా పడిపోతున్నాయనేది నిర్వాహకుల వాదన. చాలా ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత పౌల్ట్రీ రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది. కానీ పౌల్ట్రీ కేంద్రాలు మూతపడడం వల్ల అనేక మంది పని కోల్పోతున్నారు. వేసవిలో ధరల్లో కొంత హెచ్చు తగ్గులుంటాయి. కానీ 2022 నుంచి వరుస నష్టాలు చూడాల్సి వస్తోంది. అందుకే ఎక్కువ మంది పరిశ్రమలను మూత వేస్తున్నారు. ఆక్వా రంగం ఎగుమతుల్లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించింది. కానీ పౌల్ట్రీ పరిశ్రమల మీద శ్రద్ధచూపడం లేదు. పౌల్ట్రీ పరిశ్రమను మళ్లీ పట్టాలెక్కించాలంటే ప్రభుత్వ చేదోడు చాలా అవసరమని, ఒడిశా వంటి రాష్ట్రాల్లో రాయితీలు పెంచి, ఫలితాలు సాధిస్తున్న తీరుని గమనించాలని వ్యాపారులు సూచించారు.

ఎం రవీందర్
సీనియర్ జర్నలిస్ట్
7901503777