జగిత్యాలలో సంచలన పరిణామం… కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై
- జీవన్ రెడ్డి పిలుపుతో కార్యాలయంలోని కాంగ్రెస్ జెండాలు పీకేసిన అనుచరులు
- ఈ నెల 25న బీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటన
- 40ఏళ్లుగా పార్టీకి అపార సేవలు… వివిధ స్థాయిల్లో పదవులు
- రాజకీయంగా పోరాడిన సంజయ్(బీఆర్ఎస్) కాంగ్రెస్ లో చేరడంతో ముదిరిన వివాదం
కరీంనగర్ మార్చి 16(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. కొంత కాలంగా ఆయన పార్టీలో ప్రాధాన్యత లేకపోవటం.. ఇతర పార్టీ నుంచి వచ్చిన వారు తన నియోజక వర్గంలో పెత్తనం చేయటం పైన అసహనంతో ఉన్న జీవన్ రెడ్డి పార్టీని విడనున్నట్లు తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ జెండా మోసిన ఒక సీనియర్ నేత అయిన తాను ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. ఈ నెల 25వ తేదీన బీఆర్ఎస్ పార్టీలో చేరికకు సిద్దమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. రాజకీయంగా సంజయ్ కుమార్‌తో పోరాడిన జీవన్ రెడ్డి, ఇప్పుడు అదే నాయకుడికి పార్టీలో పెద్దపీట వేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు నుంచి చైర్‌పర్సన్ ఎంపిక వరకు సంజయ్ కుమార్ మాటే చెల్లుబాటు కావడం, జీవన్ రెడ్డి వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టడంతో తనకు అవమానాలు ఎదురవుతున్న పార్టీలో తాను ఉండలేనని పేర్కొన్నారు.