టాక్సీ వాలా నిర్లక్ష్యం… ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యమేనా?
- మొయినాబాద్ – చేవెళ్ల రోడ్డుపై తుఫాన్ వెనుక స్టెప్ని టైర్‌పై కూర్చుని ప్రయాణించిన వ్యక్తి
మొయినాబాద్ మార్చ్ 15(ప్రజాకేత్రం):మొయినాబాద్ నుంచి చేవెళ్ల వెళ్లే రహదారిపై టాక్సీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రయాణికులను తీసుకెళ్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడిన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎపి 28 వై 9348 నంబర్ గల తుఫాన్ వాహనం అధికంగా ప్రయాణికులను ఎక్కించుకుని రోడ్డుపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృశ్యం కనిపించింది. అంతేకాకుండా వాహనం వెనుక భాగంలో ఉన్న స్టెప్ని టైర్‌పై ఒక ప్రయాణికుడు కూర్చుని ప్రయాణించడం మరింత ఆందోళన కలిగించింది. రద్దీగా ఉన్న రహదారిపై ఇలాంటి ప్రమాదకరంగా ప్రయాణించడం ఎప్పుడైనా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం పట్టించుకోకపోవడం పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారులపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే టాక్సీలు, ప్రైవేట్ వాహనాలు నియమాలు ఉల్లంఘిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలపై ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.