prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 6:01 pm Digital Edition : PRAJA KSHETRAM

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, గొంతుకోసి హత్య

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం, గొంతుకోసి హత్య

రాజేంద్రనగర్, మార్చి 16(ప్రజాక్షేత్రం):నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని లేబర్ క్యాంపులో నివసించే ఒక వలస కూలీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటూ కనిపించకుండా పోయిన నాలుగేళ్ల చిన్నారిని ఓ కామాంధుడు పొట్టనబెట్టుకున్నాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, అత్యంత క్రూరంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నార్సింగి పరిధిలోని వివిధ నిర్మాణ రంగ పనుల కోసం ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులు ఇక్కడి లేబర్ క్యాంపుల్లో నివసిస్తున్నారు. తమ పిల్లలను క్యాంపుల్లో వదిలి తల్లిదండ్రులు పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే మార్చి 15వ తేదీన ఒక కూలీ కుటుంబానికి చెందిన నాలుగేళ్ల బాలిక కనిపించకుండా పోయింది. కంగారుపడిన తండ్రి అదే రోజు రాత్రి 12:30 గంటల సమయంలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సిసిటివి ఆధారాలతో నిందితుడి గుర్తింపు

దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనా స్థలంలోని ఆధారాలు, సీసీటీవీ విజువల్స్ పరిశీలించి నిందితుడిని గుర్తించారు. నిందితుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, మాల్దా జిల్లాకు చెందిన విశ్వాస్ హోరా (20) గా గుర్తించారు. ఇతను ఉప్పలగూడలోని వెస్ట్రన్ కన్స్ట్రక్షన్ లేబర్ కాలనీలో నివాసం ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు బయటపడ్డాయి. ఒంటరిగా ఉన్న బాలికను అపహరించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. తన నేరం బయటపడుతుందనే భయంతో బాలిక మెడను గొంతుకోసి చంపేసినట్లు విచారణలో వెల్లడించాడు. నిందితుడు చూపిన సమాచారం మేరకు సమీపంలోని పొదల మధ్య పడి ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడి అరెస్ట్

పోలీసులు నిందితుడిపై హత్య, అత్యాచారంతో పాటు పోక్సో  చట్టం కింద కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసామని పోలీసులు తెలియజేశారు.