పిట్లం కుస్తీ పోటీల్లో దమ్ము చూపించిన మల్లయోధినులు
పెద్ద కోడప్గల మార్చి 29(ప్రజాక్షేత్రం):కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఈరోజు నిర్వహించిన కుస్తీ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ పోటీలను సర్పంచ్ కుమ్మరి శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న మల్లయోధినులు తమ ప్రతిభ, శక్తి, నైపుణ్యాలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా స్థానిక అమ్మాయిలు అంతర్జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొన్న ఇద్దరు క్రీడాకారిణులను చిత్తుచిత్తుగా ఓడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోరు ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించి హర్షధ్వానాలు వినిపించింది. ఈ కార్యక్రమానికి అడ్వకేట్ రామ్ రెడ్డి, జుక్కల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇమ్రోస్, గ్రామస్తులు తదితరులు హాజరై పోటీలను వీక్షించారు. పోటీల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడగా, భద్రతా దృష్ట్యా పోలీసులు విధుల్లో ఉన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గ్రామీణ క్రీడలకు ఇలాంటి పోటీలు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయని, యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందుతుందని తెలిపారు.