ముదిరాజు కులంపై రాజకీయ దోపిడీ?
భారత రాజ్యాంగం పౌరుల సమానత్వాన్ని మరియు సామాజిక న్యాయాన్ని హామీ ఇస్తోంది. ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 15 (వివక్ష నిషేధం), ఆర్టికల్ 16 (అవకాశాల సమానత్వం) వంటి నిబంధనలు ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో “ఒక వ్యక్తికి ఒక ఓటు, ఒక ఓటుకు సమాన విలువ” అన్న సూత్రం ప్రతి సామాజిక వర్గానికి జనాభా దామాషా ప్రాతిపదికన అధికార భాగస్వామ్యాన్ని నిర్ధారించాలి. కానీ, ఈ రాజ్యాంగ ఆశయం మరియు వాస్తవ రాజకీయ పరిస్థితుల మధ్య విస్తారమైన అగాధం ఉంది. అందులోనూ తెలంగాణలో అత్యంత అధిక జనాభా కలిగిన వెనుకబడిన కులాలలో ఒకటైన ముదిరాజ్ సామాజిక వర్గం రాజకీయ ప్రాతినిధ్యంలో అత్యంత తక్కువ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఒక కుల సమస్య మాత్రమే కాదు, ఇది భారత ప్రజాస్వామ్యంలో లోతుగా పాతుకుపోయిన నిర్మాణాత్మక అసమానతకు ప్రతీక.
గణాంకాల వివరణ: లోక్‌సభ ప్రాతినిధ్యం (1952–2024) :
1952 నుండి 2024 వరకు దేశంలో 18పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారం, ముదిరాజ్ కులానికి కనీసం 84లోక్‌సభ స్థానాలు దక్కాలి. కానీ గడిచిన 72సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో కేవలం ముగ్గురు ముదిరాజ్ నాయకులు మాత్రమే లోక్‌సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇది 97.6%నష్టపోయింది. ఇప్పటి వరకు ముదిరాజ్ కుల ప్రాతినిథ్యం కేవలం 2.4 శాతం మాత్రమే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రాల చరిత్రలో 16 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ కాలంలో మొత్తం 1,743 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికవగా, జనాభా లెక్కల ప్రకారం ముదిరాజులకు 286 స్థానాలు రావాలి. కానీ వాస్తవంగా శాసనసభ గడప తొక్కిన వారు కేవలం 29 మంది మాత్రమే. ఇప్పటి వరకు 257 ఎమ్మెల్యే స్థానాలను కోల్పోయ్యాం.
సభ / ఎన్నికలు
జరిగిన ఎన్నికలు
రావాల్సిన స్థానాలు
వాస్తవంగా వచ్చినవి
లోక్‌సభ (1952–2024)
18
84
2 (2.4%)
అసెంబ్లీ (16 ఎన్నికలు)
16
286
29 (10.1%)
తెలంగాణ MLC (ప్రస్తుతం)
40 స్థానాలు
6
1 (16.6%)
(పట్టిక 1: ముదిరాజ్ సామాజిక వర్గం యొక్క రాజకీయ ప్రాతినిథ్యం. 1952 నుండి 2024 వరకు)
ప్రస్తుత తెలంగాణ శాసనసభలో (119 నియోజకవర్గాలు) BC కులాలకు చెందిన ఎమ్మెల్యేలు కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు, అయితే BC జనాభా 65% ఉంది. ముదిరాజ్ కులానికి చెందిన ఎమ్మెల్యే కేవలం ఒక్కరే ఉన్నారు. న్యాయబద్ధంగా రావాల్సిన 15-20 ఎమ్మెల్యే స్థానాలకు బదులు కేవలం ఒక్కరు , ఇది తీవ్రమైన రాజకీయ అన్యాయం. దీనికి విరుద్ధంగా, జనాభాలో 10% కూడా లేని అగ్ర కులాలకు చెందిన ఎమ్మెల్యేలు 65 మంది ఉన్నారు. 17 పార్లమెంటరీ స్థానాలలో 9 మంది, MLC లలో 20కి పైగా అగ్రకుల నాయకులు ఉన్నారు.
చారిత్రకంగా, నిజాం పరిపాలనలో ముదిరాజులకు కొంత వరకు జీవనోపాధి అనుకూలంగా ఉండేది. అయితే 1948లో భారత సమాఖ్యలో హైదరాబాద్ విలీనం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు (1956) తర్వాత ఆంధ్రా ప్రాంత అగ్రకులాల రాజకీయ, పరిపాలనా ఆధిపత్యం ముదిరాజులతో సహా తెలంగాణ BC కులాలను అన్ని రంగాలలో వెనుకకు నెట్టింది. 2014లో నిర్వహించిన తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం, ముదిరాజ్ కులం జనాభా 50 లక్షలకు పైగా ఉంది. రాష్ట్రంలోని అతి పెద్ద BC కులాలలో ఒకటి. అయినప్పటికీ ఆ సర్వే డేటాను పాలకులు “నిమ్మకు నీరెత్తినట్లు” పక్కన పెట్టారు.
తెలంగాణ తొలి మరియు మలి ఉద్యమంలో 1,269 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. వారిలో దాదాపు 81 మంది ముదిరాజ్ కులానికి చెందినవారు. ఒక కులం నుండి ఇంత పెద్ద సంఖ్యలో త్యాగాలను చేసినట్లు మరే కులంలో కనిపించదు. పోలీస్ కిష్టన్న ప్రాణ త్యాగం చేసుకున్న మొట్ట మొదటి ప్రభుత్వ ఉద్యోగి. ఉద్యమకారులపై జరుగుతున్న చిత్రహింసలను సహించలేక తన తుపాకితో తానే కాల్చుకొని ప్రాణాలు అర్పించాడు. తెలంగాణ ఉద్యమంలో ఇది మొట్టమొదటి అమరత్వంగా నమోదైంది. ఇన్ని బలిదానాలను, త్యాగాలను చేసిన ముదిరాజ్ జాతికి నేడు రాష్ట్ర ప్రభుత్వం నుండి గాని, సమాజం నుండి గాని, తగిన గుర్తింపు రాలేదు. “ప్రత్యేక తెలంగాణలో మన నీళ్ళు, నిధులు, నియామకాలు” అని పోరాడిన జాతికి నేడు రాజ్యాధికారంలో తగిన భాగస్వామ్యం లేదు.
ప్రముఖ సమాజశాస్త్రవేత్త గోవింద్ సదాశివ ఘుర్యే తన “Caste and Race in India”(1932) రచనలో కులాన్ని ఒక నిర్మాణాత్మక ఆధిపత్య సాధనంగా విశ్లేషించారు. ఆయన వాదన ప్రకారం, బలహీన వర్గాలు తమ రాజకీయ స్వేచ్ఛను కోల్పోయేది ఆకస్మికంగా జరగదు, ఇది క్రమంగా నిర్మించబడిన అసమత్వ వ్యవస్థ ఫలితం. ఈ మాటలు ముదిరాజ్ కుల పరిస్థితికి అనువదిస్తే, వారి రాజకీయ అస్తిత్వ లోపం ఒక ప్రణాళిక బద్ధంగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. BC, SC, ST వర్గాలు రాజకీయంగా, సామాజికంగా వెనుకబడడానికి ఉన్న ప్రధాన కారణం చారిత్రకంగా విద్యకు అవకాశాలు నిరాకరించబడడం. విద్య లేకుండా హక్కుల స్పృహ కలగదు, హక్కుల స్పృహ లేకుండా రాజకీయ పోరాటం సాధ్యం కాదు. తరతరాలుగా ఉన్నత కులాలు విద్యను తమ గుప్పెటలో ఉంచుకున్నాయి. దీనివల్ల BC కులాలు జరుగుతున్న అన్యాయాన్ని తక్షణమే గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోయాయి. నేడు పరిస్థితి మారుతోంది. రిజర్వేషన్ విధానాలు, ప్రభుత్వ పథకాలు, డిజిటల్ మీడియా ద్వారా ముదిరాజ్ యువత విద్యను అభ్యసిస్తోంది. ఈ విద్యావంతులైన తరం తమ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి గొంతెత్తి పోరాటం చేస్తున్నారు. ముదిరాజులు సమకాలీన అంశాలను రాజకీయ సమీకరణలను అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో చమర్ కులం (జనాభాలో అతిపెద్ద అణగారిన వర్గం) కాన్షీరామ్ మరియు మాయావతి నాయకత్వంలో “బహుజన్ సమాజ్ పార్టీ”ని ఏర్పాటు చేసుకుంది. BSP యొక్క రాజకీయ నమూనా, తమ కుల అస్తిత్వాన్ని సుస్పష్టంగా చాటుకుంటూ, ఇతర అణగారిన వర్గాలను కలుపుకోవడం. ఫలితంగా మాయావతి నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు.
అలాగే, తమిళనాడులో “పటలి మక్కళ్ కచ్చి”(PMK) వన్నియార్ కుల గుర్తింపు ఆధారంగా ఏర్పడి, రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర వహిస్తోంది. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ సిక్కు-జాట్ అస్తిత్వాన్ని రాజకీయ శక్తిగా మార్చుకుంది. కుల గుర్తింపు అనేది రాజకీయ బలహీనత, అది వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నప్పుడే రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి మరియు కమ్మ సామాజిక వర్గాలు 1910వ దశకం నుండే కుల మహాసభల ద్వారా రాజకీయ, విద్యా, మీడియా రంగాలలో తమ స్థానాన్ని పటిష్టం చేసుకున్నాయి. కట్టమంచి రామలింగారెడ్డి, వేంకట రంగయ్య వంటి నాయకుల దీర్ఘకాలిక కృషి ఫలితంగా ఇవాళ ఆ సామాజిక వర్గాలు రాజకీయంగా బలంగా ఉన్నాయి. 1880లలో ఆ. లక్ష్మీ నరసింహం గారి కృషి వల్ల వైశ్య సమాజం పునర్ ఏకీకరణ జరిగింది. ఈ చారిత్రక రాజకీయ నమూనాలు ముదిరాజులకు స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి.
ఉత్తర భారతంలో “త్రివేణి సంగమం”(యాదవ్, కుర్మి, కొయిరి కులాల కలయిక) తరహాలో తెలంగాణలో కూడా ముదిరాజులు ఇతర BC కులాలతో ఐక్య ముఖంగా రాజకీయ వ్యూహం రచించాలి. 65% BC జనాభా ఐక్యంగా నిలబడితే ఏ రాజకీయ పార్టీ కూడా వారిని నిర్లక్ష్యం చేయలేదు. ముదిరాజ్ నాయకులు ముందుగా తమ కుల జనాభా బలాన్ని గుర్తించి, రాజకీయ పార్టీలతో బేరసారాలలో ఆ బలాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలి. ఓట్లు వేసే యంత్రాలుగా కాకుండా, ఓట్లు పొందే యోధులుగా తమను తాము మార్చుకోవాలి. “ఐక్యత లేనిదే అధికారం రాదు” ఇది ముదిరాజ్ జాతికి చరిత్ర నేర్పిన పాఠం. ఈ పాఠాన్ని నేడు అమలు పరచే సమయం వచ్చింది.

తెలంగాణ ప్రెసిడెంట్,
ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోషియేషన్స్, హైద్రాబాదు సెంట్రల్ యూనివర్శిటీ
ఫోన్ నెంబర్:9963240519