prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 10:44 am Digital Edition : PRAJA KSHETRAM

వేం నరేందర్‌కు రాజ్యసభ – రేవంత్ మాట నెగ్గుతుందా?

వేం నరేందర్‌కు రాజ్యసభ – రేవంత్ మాట నెగ్గుతుందా?

హైదరాబాద్ మార్చి 04(ప్రజాక్షేత్రం):తెలంగాణలో జరగనున్న రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. శాసనసభలో ఉన్న బలాబలాల దృష్ట్యా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోటీకి దిగినా దిగకపోయినా ఈ రెండు స్థానాలు కాంగ్రెస్ వశం కావడం ఖాయం. అయితే, ఈ సులభమైన విజయం కంటే, పార్టీలో ఈ సీట్ల కోసం సాగుతున్న అంతర్గత పోటీ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. కేవలం రెండు స్థానాల కోసం ఏకంగా 16 మంది సీనియర్ నేతలు రేసులో ఉండటం కాంగ్రెస్ హైకమాండ్‌కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాలుగా మారింది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ రెండు స్థానాల్లో ఒకటి ఖచ్చితంగా హైకమాండ్ కోటా కింద ఢిల్లీ నేతలకు కేటాయించే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో పార్టీ అవసరాల దృష్ట్యా ఏఐసీసీ ముఖ్య నేతలను ఇక్కడి నుంచి పెద్దల సభకు పంపవచ్చని చర్చ జరుగుతోంది. ఇక మిగిలిన ఒక్క స్థానంపైనే రాష్ట్ర నేతలందరి కన్ను పడింది. ఈ రెండో సీటును తన ముఖ్యమంత్రి కోటా కింద తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకోవాలని రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

వేంకు న్యాయం చేయాలని రేవంత్ పట్టుదల

వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపడం రేవంత్ రెడ్డికి ఒక రాజకీయ అవసరంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి వేం ఆయనకు అత్యంత నమ్మకస్తుడైన సహచరుడిగా, వ్యూహకర్తగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉన్న వేంకు పార్లమెంటు సభ్యత్వం కల్పించడం ద్వారా, తన మాట కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద ఎంత బలంగా ఉందో చాటిచెప్పాలని రేవంత్ భావిస్తున్నారు. వేం నరేందర్ రెడ్డికి సీటు సాధించుకోగలిగితే, రేవంత్ రెడ్డి పలుకుబడి గట్టిగానే ఉందని, పార్టీలో ఆయన అప్రహతిహత నాయకత్వం కొనసాగుతోందని సంకేతాలు వెళ్తాయి.

హైకమాండ్ ఆలోచన ఏమిటో?

ఈ ప్రయత్నం అంత సులభంగా సాగేలా లేదు. పార్టీ కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న సీనియర్ నేతలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత వంటి అంశాలను హైకమాండ్ పరిగణనలోకి తీసుకుంటే వేం ఎంపికపై సందిగ్ధత నెలకొనే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి తన విజ్ఞప్తిని ఢిల్లీ స్థాయిలో ఎలా ఒప్పిస్తారో, అందరినీ కాదని తన అనుచరుడికి పట్టం కట్టించుకోగలరో లేదో వేచి చూడాలి. ఈ నియామకం రేవంత్ రెడ్డి రాజకీయ చాణక్యానికి , హైకమాండ్ వద్ద ఆయనకున్న క్రెడిబిలిటీకి ఒక లిట్మస్ టెస్టుగా మారనుంది.