ప్రజలకు అందుబాటులో న్యాయం – లోక్ అదాలత్ ప్రత్యేకత
- 81,078 కేసులకు పరిష్కారం
- రూ.34.54 లక్షల పరిహారం
కుషాయిగూడ, మార్చి 28(ప్రజాక్షేత్రం):జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వి. బాల భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ సెక్రటరీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సత్తు రవీందర్ మాట్లాడుతూ లోక్ అదాలత్‌ల ద్వారా రాజీ పడదగిన కేసులను వేగంగా, సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 25 బెంచ్‌లలో మొత్తం 81,078 కేసులు పరిష్కరించగా, అందులో 39 సివిల్, 81,007 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదనంగా బ్యాంకులు, బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించిన 32 ప్రీ-లిటిగేషన్ కేసులు కూడా పరిష్కారం పొందాయి. ఈ లోక్ అదాలత్ ద్వారా మొత్తం రూ.34,54,988 పరిహారం చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి బి. తిరుపతి, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది, బ్యాంకులు, బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది పాల్గొన్నారు.