ఎన్‌సీసీ ప్రాజెక్ట్‌లో ఘోరం – క్రేన్ ప్రమాదంలో ఐదుగురు మృతి
శంకర్‌పల్లి, ఏప్రిల్ 27(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్‌సీసీ ప్రాజెక్ట్‌లో మధ్యాహ్నం సమయంలో బలమైన గాలుల ప్రభావంతో భారీ క్రేన్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ముఖేష్, నాగేందర్ మాథూర్ (ఝార్ఖండ్), అలీ హుస్సేన్, సాజిద్, సోను (ఉత్తరప్రదేశ్)గా గుర్తించారు. మరో పదిమంది వరకు కార్మికులు తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కసారిగా గాలి వేగం పెరగడంతో క్రేన్ అదుపుతప్పి కూలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పలేదని చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే యాజమాన్యం సహాయక చర్యలు ప్రారంభించింది. శిధిలాల కింద మరెవరైనా చిక్కుకుని ఉన్నారా అన్న కోణంలో శోధన కొనసాగుతోంది. డీసీపీ యోగేష్ గౌతమ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.