prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 5:12 pm Digital Edition : PRAJA KSHETRAM

ఎస్ అర్ ఓల ఇళ్లలో కనకవర్షం

ఎస్ అర్ ఓల ఇళ్లలో కనకవర్షం

  • నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న ఏసీబీ
  • బహిర్గతమైన వాట్సాప్ చాటింగ్.. అధికారుల అవినీతి గుట్టురట్టు
  • ఫోన్ పే ద్వారానే రూ.42 లక్షల లావాదేవీలు
  • వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కళ్లు చెదిరే అక్రమాలు
  • ఏసీబీ సోదాలతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి

హనుమకొండ, ఏప్రిల్ 03(ప్రజాక్షేత్రం):హనుమకొండ వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని ఏసీబీ సోదాల్లో తేలిపోయింది. నిన్న నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు, ప్రైవేటు వ్యక్తుల మధ్య సాగుతున్న చీకటి దందా బట్టబయలైంది. తనిఖీల సమయంలో కార్యాలయంలో ఏకంగా 20 మంది అనధికార ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు తిష్టవేసి ఉండటం అధికారులను ఆశ్చర్యపరిచింది. వారి సెల్ ఫోన్లను పరిశీలించగా డిజిటల్ మాఫియా వెలుగుచూసింది. కేవలం ఏడాది కాలంలోనే రూ.42 లక్షల మేర ‘ఫోన్ పే’ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించింది. ఎస్ఆర్వోలు వాట్సాప్ చాటింగ్ ద్వారా చిక్కారు. ఎస్ఆర్లు రామనర్సింహారావు, ఆనంద్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు వారి అక్రమాలకు సాక్ష్యంగా నిలిచాయి. ఆఫీసులో 204 డెలివరీ కాని డాక్యుమెంట్లు ఎస్ఆరీల వద్దే పెండింగ్లో ఉండటం గమనార్హం.

  • ఇళ్లలో భారీగా ఆస్తులు

ఎస్ఆర్ఆల నివాసాల్లో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో కళ్లు చెదిరే రీతిలో అక్రమాస్తులు దొరికాయి. నగదు రూ.24.61 లక్షలు, బంగారం 820 గ్రాములు, వెండి 2.60 కిలోలు, ఎస్ఆర్ఆ ఆనంద్ పేరిట కపిల్ చిట్స్లో రూ. 30 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కార్యాలయంలో లెక్కల్లో చూపని మరో రూ. 47,450 నగదుతో పాటు 70 కీలక దస్త్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.