నాగారం డివిజన్‌లో అక్రమ భవనాలపై చర్యలు ఎక్కడ?
“నోటీసులు ఇచ్చి… నోట్లు తీసుకున్నారా?” ప్రజల్లో అనుమానాలు
సర్కిల్ కార్యాలయం దూరం… నాగారంలో అక్రమాలకు దారి?
“నోటీసులు ఇచ్చి హోల్స్ పెట్టిన తర్వాత కూడా ఇలా నిర్మాణం కొనసాగడం ఎలా?”
నాగారం, ఏప్రిల్ 7 (ప్రజాక్షేత్రం):ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్‌లో అక్రమ నిర్మాణాల హడావిడి రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా శిల్పానగర్, ప్రశాంత్ నగర్ కాలనీలు మరియు నాగారం ప్రధాన రహదారి పరిసరాల్లో అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం జరుగుతున్నాయి. సుమారు ఆరు నెలల క్రితం అధికారులు ఒక అక్రమ భవనంకుహోల్స్ పెట్టి ఆపించిన స్లాబ్‌పై తిరిగి గోడలు నిర్మాణం కొనసాగుతుండటంపై స్థానికులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. “అధికారులు నిజంగా చర్యలు తీసుకుంటున్నారా? లేక కేవలం చూపు కోసం చర్యలేనా?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.పట్టణ ప్రణాళిక నిబంధనలు పూర్తిగా విస్మరించబడుతున్నాయి. సెట్‌బ్యాక్‌లు లేకుండా, అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు విస్తరిస్తుండటంతో రహదారులపై ఆక్రమణలు పెరిగి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోంది. అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆ తర్వాత ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. “నోటీసులు ఇచ్చి… నోట్లు తీసుకుంటున్నారా?” అనే ఆరోపణలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. కొంతమంది నిర్మాణదారులు అధికారులతో కుమ్మక్కై పనులు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
నాగారం డివిజన్‌కు ఘట్కేసర్ సర్కిల్ కార్యాలయం దూరంగా ఉండటం వల్ల పర్యవేక్షణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని కొందరు నిర్మాణదారులు అవకాశంగా మలుచుకుంటున్నారని స్థానికులు అంటున్నారు. ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఈ అంశంపై పలు దినపత్రికల్లో కథనాలు వెలువడినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఫలితంగా అక్రమ నిర్మాణాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రత్యేక దళాలతో తనిఖీలు నిర్వహించి అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

