బ్రాహ్మణేతరులకు అర్చకులుగా అవకాశం అవ్వాలి
- మంద కృష్ణ మాదిగ సంచలన డిమాండ్
హైదరాబాద్ ఏప్రిల్ 13(ప్రజాక్షేత్రం):దేశంలోని హిందూ దేవాలయాల్లో పూజారుల నియామకానికి సంబంధించి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవాలయాల్లో కొనసాగుతున్న వారసత్వ అర్చకత్వాన్ని ప్రశ్నించారు. దేశంలోని దేవాలయాల్లో కేవలం ఒకే వర్గానికి చెందిన వారు కాకుండా, అన్ని కులాల వారికి పూజారులుగా అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని వర్గాలకు ఎలాగైతే ప్రాతినిధ్యం ఉంటుందో, ఆలయాల్లోనూ అలాగే ఉండాలని పేర్కొన్నారు.
మత మార్పిడులు – సామాజిక మార్పు..
క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు పాస్టర్లుగా ఎదుగుతున్నారని, అలాగే ఇస్లాం తీసుకున్న వారు కూడా ముల్లాలుగా మారుతున్నారని ఆయన గుర్తుచేశారు. కానీ హిందూ మతంలో మాత్రం పరిస్థితి “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే” అన్న చందంగా ఉందని విమర్శించారు. అయోధ్య రామమందిరం వంటి ప్రతిష్టాత్మక ఆలయాల్లో ఇప్పటివరకు బ్రాహ్మణేతరులకు పూజారులుగా ఎందుకు అవకాశం ఇవ్వలేదని మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని నిలదీశారు. దశాబ్దాలుగా ఒకే వర్గం పూజారులుగా కొనసాగడం సామాజిక న్యాయానికి విరుద్ధమని, బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించే బాధ్యతను ప్రభుత్వాలే తీసుకోవాలని ఆయన కోరారు. హిందూ ధర్మంలో సంస్కరణలు రావాలని, ఆలయాల్లో అన్ని వర్గాల వారు రాణించినప్పుడే నిజమైన సామాజిక సమతుల్యత ఏర్పడుతుందని మందకృష్ణ మాదిగ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గర్భగుడిలోకి వెళ్లడానికి అందరూ అర్హులే. దేవుడు అందరికీ సమానమే. ఇందుకు రామానుజాచార్యులే స్ఫూర్తి. నిజమైన సంఘసంస్కర్త రామానుజాచార్యులు. అంబేద్కర్ భావజాలమే మా డిమాండ్. ఆలయాల్లో వివక్ష ఎందుకు? అని మందకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడీ కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.