prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 6:07 pm Digital Edition : PRAJA KSHETRAM

నాచారం డ్యూరోఫ్లెక్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

నాచారం డ్యూరోఫ్లెక్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

  • పొగమంచుతో కమ్ముకున్న పరిశ్రమ ప్రాంతం… మంటల అదుపుకు శ్రమ
  • డ్యూరోఫ్లెక్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం… ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది.                             నాచారం, ఏప్రిల్ 18(ప్రజాక్షేత్రం):ఉప్పల్ నియోజకవర్గంలోనీ నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని డ్యూరోఫ్లెక్స్ మాట్రెస్ తయారీ పరిశ్రమలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాబా ఫంక్షన్ హాల్‌కు ఎదురుగా ఉన్న ఈ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో కమ్ముకున్నాయి. మాట్రెస్ తయారీలో ఉపయోగించే ఫోమ్, రబ్బరు, కెమికల్స్ వంటి పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని స్థానికులు తెలిపారు. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.
    ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలపై స్పష్టత కోసం అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు.
    సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాటిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
    ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. యంత్రాలు, ముడిసరుకు, తయారైన ఉత్పత్తులు అగ్నికి ఆహుతయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రాణనష్టం జరగలేదని ప్రాథమికంగా తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.