prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 5:45 pm Digital Edition : PRAJA KSHETRAM

ఔటర్ రింగ్ రోడ్డుపై తగలబడ్డ ఎయిర్ ఇండియా బస్సు

ఔటర్ రింగ్ రోడ్డుపై తగలబడ్డ ఎయిర్ ఇండియా బస్సు

  • పెద్ద అంబర్ పేట సమీపంలో ఎయిర్ ఇండియా బస్సులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
  • చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కన ఆపేసిన డ్రైవర్
  • ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా నిలిచిన ట్రాఫిక్

హైదరాబాద్‌ మే 26(ప్రజాక్షేత్రం):ఔటర్ రింగ్ రోడ్డుపై ఈరోజు ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద అంబర్‌పేట సమీపంలో ఓఆర్ఆర్‌పై ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఒక బస్సులో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. బస్సు వేగంగా వెళుతున్న సమయంలో ఒక్కసారిగా వాహనం వెనుక భాగం నుంచి దట్టమైన పొగలు రావడాన్ని లోపల ఉన్న ప్రయాణికులు గమనించారు.
ప్రయాణికులు వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో, ఆయన క్షణాల వ్యవధిలో చాకచక్యంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. ప్రయాణికులు కిందకు దిగుతుండగానే మంటలు బస్సు మొత్తానికి వేగంగా వ్యాపించాయి. ఓఆర్ఆర్‌పై బస్సు విపరీతమైన మంటలతో, భారీగా ఎగసిపడుతున్న పొగలతో తగలబడుతుండటంతో ఆ మార్గంలో వెళుతున్న ఇతర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం బస్సులో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.