prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 8:49 pm Digital Edition : PRAJA KSHETRAM

కొమురవెల్లిలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రత్యేక పూజలు

కొమురవెల్లిలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రత్యేక పూజలు

  • కొమురవెల్లి ఆలయంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్

హైదరాబాద్ మే 13(ప్రజాక్షేత్రం):జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక ఆర్చనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మాధవి మల్లికార్జున్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్‌తో పాటు ఇతర ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ కొమురవెల్లి మల్లికార్జున స్వామి తమ ఇంటి దైవం, కులదైవమని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన తొమ్మిది దేవాలయాల జాబితాలో కొమురవెల్లి ఆలయాన్ని కూడా చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరతానని తెలిపారు. దీనికి సంబంధించి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

అతిథి గృహ నిర్మాణంపై హామీ

దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయం సమీపంలో ప్రభుత్వ తరఫున అతిథి గృహం నిర్మించేందుకు కూడా కృషి చేస్తానని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వెల్లడించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.