prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 5:31 pm Digital Edition : PRAJA KSHETRAM

కోదాడలో ఘోరం నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!

కోదాడలో ఘోరం నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!

సూర్యాపేట జిల్లా మే 06(ప్రజాక్షేత్రం):కోదాడ పట్టణంలో బుధవారం పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. స్థానిక బస్టాండ్ సమీపంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి తన భార్యను కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన శిరీష, మణిదీప్ దంపతులు బుధవారం కోదాడకు వచ్చారు. బస్టాండ్ ముందు మాట్లాడుకుంటున్న క్రమంలో ఇద్దరి మధ్య ఒక్కసారిగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశానికి లోనైన మణిదీప్, తన వద్ద ఉన్న కత్తితో భార్య శిరీషపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మెడ, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆమె రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

స్తంభించిపోయిన జనం

ప్రజలు రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే నిందితుడు దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేయగా, అక్కడే ఉన్న కొందరు సాహసించి అతడిని పట్టుకున్నట్లు సమాచారం.

కుటుంబ కలహాలే కారణమా?

కాపురంలో తలెత్తిన గొడవలు, కుటుంబ కలహాల నేపథ్యమే ఈ హత్యకు దారి తీసిందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.