prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 12:47 am Digital Edition : PRAJA KSHETRAM

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డికి ఘన నివాళులు

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డికి ఘన నివాళులు

తెలుగు భాషా సంస్కృతులకు అపార సేవలు చేసిన మహనీయుడు

ఎమ్మెల్యే మేఘారెడ్డి

అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన బహుముఖ ప్రజ్ఞాశాలి

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్,
జిల్లా కాంగ్రెస్ చీఫ్ శివసేనరెడ్డి

వనపర్తి, మే 28(ప్రజాక్షేత్రం):తెలంగాణ సామాజిక చరిత్రకు, తెలుగు భాషాభివృద్ధికి, ప్రజా చైతన్యానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనరెడ్డి కొనియాడారు. తెలంగాణ వైతాళికుడిగా పేరుగాంచిన సురవరం జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల స్వరంగా నిలిచి వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తిత్వమని అభివర్ణించారు. సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతి సందర్భంగా గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ చీఫ్ శివసేనరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో సురవరం చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పత్రికా సంపాదకుడిగా సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తెలంగాణ ప్రాంత చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప మేధావిగా ఆయన పేరు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధికి, సామాజిక చైతన్యానికి, ప్రజల్లో విజ్ఞాన వికాసానికి ఆయన చేసిన సేవలు అపారమన్నారు. ‘గోల్కొండ’ పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి సామాజిక సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అని కొనియాడారు. తెలంగాణ చరిత్రను పుస్తక రూపంలో అందించి భవిష్యత్ తరాలకు అమూల్యమైన వారసత్వాన్ని అందించారన్నారు. సాహిత్యం, చరిత్ర, జర్నలిజం రంగాల్లో ఆయన చేసిన సేవలు నేటికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు శివసేనరెడ్డి మాట్లాడుతూ విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని విశ్వసించిన సురవరం తెలంగాణ సంస్కృతి, చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. సామాజిక అసమానతలను తొలగించి సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేశారని గుర్తుచేశారు. వనపర్తి నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా ప్రజల కోసం విశేష సేవలు అందించారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిలి ఆదిత్య, పట్టణ అధ్యక్షుడు కదిరి రాములు, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, ధనలక్ష్మి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.