prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 12:47 pm Digital Edition : PRAJA KSHETRAM

బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. విచారణకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు!

బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. విచారణకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు!

హైదరాబాద్ మే 11(ప్రజాక్షేత్రం):కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత వేగంగా స్పందించారు. ఈనెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ, ఇంతవరకు చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరిగిందని డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లలో సిబ్బంది నిమగ్నమై ఉండటం వల్లే ఆలస్యమైందని డీజీపీ వివరణ ఇవ్వగా, దీనిపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక విచారణ బృందాలను ఏర్పాటు చేసి నివేదిక సమర్పించాలని డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ఈ కేసులో పరస్పర ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి. తన 17 ఏళ్ల కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నారంటూ ఓ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పేట్‌బషీరాబాద్ పోలీసులు పోక్సో చట్టం మరియు బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఇది తనపై జరుగుతున్న కుట్ర అని, సదరు బాలిక కుటుంబం తనను డబ్బుల కోసం బెదిరిస్తోందని భగీరథ్ కరీంనగర్ పోలీసులను ఆశ్రయించడంతో అక్కడ కూడా కేసు నమోదైంది. ఈ సున్నితమైన అంశంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా రంగంలోకి దిగింది. కమిషన్ ఛైర్‌పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి పోలీసుల నుంచి పూర్తి వివరాలను తెప్పించుకోవడమే కాకుండా, విచారణ కోసం ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.