prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 8:44 pm Digital Edition : PRAJA KSHETRAM

బండి భగీరథ్ కనిపించడం లేదు.. హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు!

బండి భగీరథ్ కనిపించడం లేదు.. హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు!

హైదరాబాద్ మే 13(ప్రజాక్షేత్రం):పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ కనిపించడం లేదని హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి సహా అనేక ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఈ పోస్టర్లు కలకలం సృష్టించాయి. బండి భగీరథ్ ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్‌లో చెప్పండి అంటూ మెట్రో పిల్లర్లు, బస్టాప్‌లు, ప్రధాన కూడళ్లలో పలువురు ఈ పోస్టర్లను అతికించారు. మరోవైపు పలువురు సామాజికవేత్తలు సైతం బండి భగీరథ్ కనిపించడం లేదంటూ హైదరాబాద్ మెట్రోలో ప్రచారం చేశారు. మీకు ఎవరికైనా కనిపిస్తే డయల్ 100కు కాల్ చేసి సమాచారం చెప్పండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ముందు నుంచి బండి సంజయ్ కుమారుడిని రక్షించేందుకు తాపత్రాయపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పోస్టర్లను వెంటవెంటనే చించేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

బండి సంజయ్ కొడుకుపై సెక్షన్లను సవరించిన పోలీసులు

బండి సంజయ్ కుమారుడిపై తాజాగా కొన్ని సెక్షన్లను అదనంగా చేర్చారు. పోక్సో చట్టం సెక్షన్‌ 5(1) రెడ్‌ విత్‌ 6ను జత చేశారు. ఇంతకుముందు బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్‌ పోలీసులు సెక్షన్‌ 11 రెడ్‌ విత్‌ 12 ఆఫ్‌ పోక్సో చట్టం, బీఎన్‌ఎస్‌ 74, 75 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదివరకు లైంగిక వేధింపులుగా భావించిన పోలీసులు ఇప్పుడు సెక్షన్లను మార్చడం కేసు తీవ్రత మరింత పెరిగి, చట్టం నుంచి భగీరథ్‌ తప్పించుకోలేని స్థితికి వచ్చాడు. పోలీసులు తాజాగా జతచేసిన సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే.. నిందితుడికి 20 ఏండ్లకు తగ్గకుండా జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయి. కేసు మరింత తీవ్రంగా ఉండేపక్షంలో మరణశిక్ష కూడా పడవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును మహిళా ఐపీఎస్‌ అధికారి రితిరాజ్‌కు అప్పగించిన నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేసిన పోలీసులు భగీరథ్‌ను బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు విచారణకు హాజరు కావాలని కరీంనగర్‌లో అతని బంధువులకు నోటీసులు అందించారు.

తొలుత కేసును నీరుగార్చే యత్నం

ఈ నెల 8న బాధితురాలైన మైనర్‌పై లైంగిక వేధింపులు జరిగాయంటూ ఆమె తల్లి పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లినప్పుడు.. పోలీసులు హైడ్రామా మధ్య సెక్షన్‌ 74, 75 అఫ్‌ బీఎన్‌ఎస్‌, సెక్షన్‌ 11 రెడ్‌ విత్‌ 12 ఆఫ్‌ పోక్సో యాక్ట్‌ 2012 మేరకు కేసులు నమోదు చేశారు. ఆ తరువాత బాధితురాలి నుంచి మహిళా అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు బాధితురాలు నిజం చెప్పకుండా ఉండేలా ఒత్తిళ్లు తెచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగడంతో.. ప్రభుత్వం సోమవారం కూకట్‌పల్లి జోన్‌ డీసీపీ రితిరాజ్‌ను ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించింది. వెంటనే దర్యాప్తును చేపట్టిన రితిరాజ్‌ సోమవారం సాయంత్రం పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఘటన గురించి ఆరా తీశారు. అప్పటికే పోలీసులు బాధితురాలి నుంచి తీసుకున్న వాంగూల్మాన్ని పరిశీలించారు. అందులో స్పష్టత లేకపోవడంతో మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం నేరుగా బాధితురాలిని కలిసి జరిగిన విషయం తెలుసుకున్నారు. పోక్సో కేసు దర్యాప్తులో మహిళా అధికారులు ఫ్రెండ్లీ వాతావరణంలో బాధితురాలి నుంచి జరిగిన ఘటనకు సంబంధించిన అంశాలను సేకరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే రితిరాజ్‌ నేరుగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెతో చాలాసేపు మాట్లాడినట్టు తెలిసింది. బాధితురాలు చెప్పిన విషయాలకు పోలీసులు కేసు నమోదు చేసిన సెక్షన్లకు పొంతన లేని విషయాన్ని ఆమె గుర్తించారు. బాధితురాలు చేసిన ఆరోపణలు పోక్సో చట్టంలోని సెక్షన్‌ 5(1), 6ల పరిధిలోకి వస్తాయి. బాధితురాలిపై పలుమార్లు లైంగికదాడి జరిగినట్టు ఆరోపణలుంటే ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని చట్టం సూచిస్తున్నది.

తీవ్రమైన సెక్షన్ల జోడింపు

బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జరిగిన నేరం అత్యంత తీవ్రమైనదని గ్రహించిన డీసీపీ ఆ మేరకు కేసులో సెక్షన్లను అలర్ట్‌ చేయించారు. పోక్సో చట్టంలోని సెక్షన్‌ 5(1) రెడ్‌ విత్‌ 6ను జోడించారు. దీంతో ఇప్పటివరకు లైంగికదాడికి యత్నంగా భావిస్తూ వస్తున్న ఈ కేసులో బలాత్కారం జరిగినట్టు నిర్ధారణ అవుతున్నది. కొత్తగా అలర్ట్‌ చేసిన సెక్షన్లతో పోలీసులు మంగళవారం భగీరథ్‌కు నోటీసులు జారీచేశారు. దర్యాప్తు బృందం నోటీసులు ఇవ్వడానికి కరీంనగర్‌ వెళ్లినప్పుడు.. అక్కడ భగీరథ్‌ లేకపోవడంతో అతడి మేనమామ డాక్టర్‌ వంశీకృష్ణకు అందజేశారు. బండి సాయిభగీరథ్‌పై పేట్‌బషీరాబాద్‌లో నమోదైన 684/2026 కేసులో నిందితుడిగా ఉన్నాడని, అతనిపై పోక్సో కేసు నమోదైందని, పలు అభియోగాలున్నాయని నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు 13వ తేదీ మధ్యాహ్నం బండి సాయిభగీరథ్‌ను విచారణకు తీసుకొని రావాలంటూ ఆయనకు సూచన చేశారు. ఇదిలాఉండగా భగీరథ్‌ ఫోన్‌ స్విచాఫ్‌లో ఉందని పోలీసులు గుర్తించారు.