బండి భగీరథ్ పోక్సో కేసు విచారణ ప్రారంభం
– పేట్ బషీరాబాద్ పీఎస్‌కు చేరుకున్న కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్
– ఉన్నతాధికారుల ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం
– మైనర్ బాధితురాలి స్టేట్‌మెంట్ త్వరలో నమోదు
– నిందితులు ఎవరైనా కఠిన చర్యలు: సిట్ అధికారిణి
కుత్బుల్లాపూర్, మే 11(ప్రజాక్షేత్రం):పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై విచారణ వేగవంతమైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ విచారణ అధికారిణి, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అధికారులతో సమావేశమయ్యారు. ఎస్‌హెచ్‌ఓ క్యాబిన్‌లో ఏసీపీతో కలిసి కేసు పురోగతిపై సమీక్ష నిర్వహించిన అనంతరం డీసీపీ రితిరాజ్ మీడియాతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించామని, కేసులో ఎవరైనా నిందితులుగా తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే మైనర్ బాధితురాలి స్టేట్‌మెంట్‌ను కూడా నమోదు చేయనున్నట్లు సిట్ అధికారిణి వెల్లడించారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.