prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 9:02 pm Digital Edition : PRAJA KSHETRAM

మహనీయుల ఆశయాలతోనే సామాజిక న్యాయం సాధ్యం:మంద కృష్ణ మాదిగ

మహనీయుల ఆశయాలతోనే సామాజిక న్యాయం సాధ్యం:మంద కృష్ణ మాదిగ

  • హక్కుల కోసం పోరాటాలే సామాజిక మార్పులకు బాట.
  • విగ్రహాలు కాదు.. ఆశయాలే తరాలకు మార్గదర్శనం.
  • అందరికీ హక్కులు దక్కినప్పుడే నిజమైన స్వేచ్ఛ.
  • హక్కుల కోసం జరిగిన ఉద్యమాలే సామాజిక విప్లవానికి నాంది.

చేవెళ్ల, మే 30(ప్రజాక్షేత్రం):సమాజంలో సమానత్వం నెలకొని ప్రతి వ్యక్తికి సమాన హక్కులు, అవకాశాలు లభించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామంలో మహాత్ముల విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్, కాన్షీరాం వంటి మహనీయుల సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. వారి ఆలోచనలు, సిద్ధాంతాలు నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని చెప్పారు. “ఎక్కడ అందరూ తాగే బావి ఉంటుందో అక్కడ మేమూ నీళ్లు తాగే అవకాశం ఉండాలి. అందరికీ లభించే హక్కులు మాకూ దక్కాలి. సమాజంలో సమాన హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఆ పోరాటాల ఫలితంగానే నేడు అనేక వర్గాలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కులు లభిస్తున్నాయి” అని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే లక్ష్యంతో డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం కల్పించినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో కుల వివక్ష, సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులు పూర్తిగా తొలగిపోయే వరకు సామాజిక చైతన్యం అవసరమని చెప్పారు. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం కేవలం వారిని స్మరించుకోవడానికే కాదని, వారి ఆశయాలను భావితరాలకు చేరవేసే ప్రయత్నమని పేర్కొన్నారు. విగ్రహాలను చూసి యువత మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకుని సమాజ అభివృద్ధికి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. సామాజిక న్యాయం కోసం జరిగిన ఉద్యమాల చరిత్రను యువత అధ్యయనం చేయాలని, విద్య, చైతన్యం, సంఘటిత శక్తి ద్వారానే అణగారిన వర్గాలు మరింత పురోగతి సాధించగలవని అన్నారు. మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ ఆలూర్ గ్రామ ప్రజలు సామాజిక ఐక్యతకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఆలూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పామెన భీమ్ భారత్ మాట్లాడుతూ మహనీయులు చూపిన సమానత్వ మార్గంలో సమాజం ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం, విద్య, చైతన్యం ద్వారా మాత్రమే అణగారిన వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి ఉపేందర్, ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నర్సింహా, రావుగల్ల బాబు, ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కాడిగల్ల ప్రవీణ్ కుమార్, జిల్లా కార్యదర్శి శివ శంకర్, మండల అధ్యక్షులు ప్రవీణ్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మహేందర్ స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సామాజిక సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సభా ప్రాంగణంలో జైభీమ్‌, ఫూలే, కాన్షీరాం నినాదాలు మారుమోగాయి. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.