prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 6:14 pm Digital Edition : PRAJA KSHETRAM

మొయినాబాద్‌ మార్గంలో.. ‘ముంజల’ జాతర!

మొయినాబాద్‌ మార్గంలో.. ‘ముంజల’ జాతర!

  • హైవేపై తెల్లని ‘మంచు’ ముక్కలు
  • నగరవాసుల మనసు దోస్తున్న ‘ఐస్‌ ఆపిల్స్‌’
  • ఎండకాలం స్పెషల్‌..
  • గీత కార్మికుల ఇంట కురుస్తున్న సిరుల జల్లు!

మొయినాబాద్, మే 05(ప్రజాక్షేత్రం):మొయినాబాద్‌ రోడ్డు.. ఇప్పుడు ముంజల అడ్డా! మండుతున్న ఎండలకు విరుగుడుగా.. ప్రకృతి ప్రసాదించిన అమృతంలా.. తాటి ముంజలు సిద్ధమయ్యాయి. సిటీ శివార్లలోని ఈ జాతీయ రహదారి ఇప్పుడు అచ్చమైన తెలంగాణ పల్లెటూరి సంతను తలపిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా బుట్టల నిండా ‘తెల్లని ముత్యాల్లాంటి’ ముంజలను చూస్తుంటే బాటసారుల నోరూరాల్సిందే!

చల్లని ముంజ.. చెమట పట్టని ప్రయాణం!

నగరపు కాంక్రీట్ జంగిల్‌లో సెగలతో ఉక్కిరిబిక్కరి అవుతున్న సాఫ్ట్‌వేర్ బాబులు, సరదాగా లాంగ్ డ్రైవ్‌కు వెళ్లే కుర్రకారు.. అందరి స్టాపింగ్ పాయింట్ ఇప్పుడు మొయినాబాద్ మండలమే. తాటి చెట్టు నుంచి అప్పటికప్పుడు దించిన కాయలను కొట్టి, బొటనవేలితో ఆ ముంజను తీస్తుంటే వచ్చే ఆ మజానే వేరు.

నగరవాసుల క్యూ

వీకెండ్‌ వచ్చిందంటే చాలు.. మొయినాబాద్‌ హైవే ట్రాఫిక్‌ జామ్‌ కావాల్సిందే! కారణం వాహనాల రద్దీ కాదు.. రోడ్డు పక్కన ఆగి ముంజలను లొట్టలేస్తూ తినే ముంజల ప్రేమికులు.

తెలంగాణ ‘ఐస్‌ ఆపిల్‌’కు భలే గిరాకీ!

వ్యాపారం అంటే ఇది కదా అనిపించేలా ఇక్కడ విక్రయాలు సాగుతున్నాయి. మండలం చుట్టుపక్కల ఉన్న వందలాది తాటి వనాలే ఇక్కడ ఉపాధికి వనరులు. ఒక్కో గీత కార్మికుడు రోజుకు రూ. 2000 నుంచి రూ. 4000 వరకు వ్యాపారం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. కెమికల్ డ్రింక్స్ కంటే ఈ ముంజలే ఉత్తమమని నగరవాసులు కుటుంబం మొత్తానికి సరిపడా ప్యాకెట్లలో కొనుక్కుని వెళ్తున్నారు.

మొయినాబాద్‌.. ముంజల బ్రాండ్‌!

“ఒక్కసారి ఈ ముంజలు తింటే ఎండ దెబ్బ కొట్టదు. చదువుకున్న పిల్లలు కూడా సెలవుల్లో వచ్చి మాకు సహాయం చేస్తున్నారు. మా బతుకుదెరువుకు ఈ సీజనే ఆధారం. సర్కారు ఇస్తున్న ప్రోత్సాహంతో మా వృత్తికి గౌరవం పెరిగింది.”