రేవంత్ అబద్ధం చెప్పారా లేక బండి సంజయ్ అబద్ధం చెప్పారా?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- తన కొడుకుని తానే పోలీసులకు అప్పగించానన్న బండి సంజయ్
- భగీరథ్‌ను పోలీసులే అరెస్ట్ చేశారన్న రేవంత్ రెడ్డి
- ఇద్దరిలో ఎవరు చెప్పింది నిజమన్న ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ మే 21(ప్రజాక్షేత్రం):పోక్సో కేసు నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అరెస్ట్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ రచ్చకు దారితీసింది. ఈ అరెస్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై బీఆర్‌ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అసలు జరిగింది పోలీసు అరెస్ట్ కాదా? లాయర్ల సమక్షంలో జరిగిన సరెండరా? ఏది నిజం? అని ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధం చెబుతున్నారా.. లేక కేంద్ర మంత్రి బండి సంజయ్ అబద్ధం చెబుతున్నారా? అని ఆయన నిలదీశారు. అసలేం జరిగిందంటే… ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… “రోడ్డు మధ్యలో నాకాబందీ నిర్వహించి మరీ బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో రాజకీయం లేదు, పోలీసుల మాట నమ్మాలి” అని స్పష్టం చేశారు. దీనికి భిన్నంగా నిన్న బండి సంజయ్ స్పందించారు. “నేనొక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రిగా, రాజకీయ నాయకుడిగా నా కొడుకును నేనే నా లాయర్ల ద్వారా పోలీసులకు సరెండర్ చేశాను” అని చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో “మనం రాష్ట్ర ముఖ్యమంత్రిని నమ్మాలా? లేక దేశ హోంశాఖ సహాయ మంత్రిని నమ్మాలా?” అని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.