హైదరాబాద్, మే 03(ప్రజాక్షేత్రం):సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వారాంతంలో నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. రెండు కమిషనరేట్లలో కలిపి మొత్తం 728 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మే 1, 2 తేదీల్లో నిర్వహించిన తనిఖీల్లో 445 మందిని పట్టుకున్నారు. వీరిలో 371 మంది ద్విచక్ర వాహనదారులు, 26 మంది త్రీవీలర్ వాహనదారులు, 48 మంది కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. పట్టుబడిన వారి బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (బీఏసీ) స్థాయిల ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) తెలిపారు. మరోవైపు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 283 మంది పట్టుబడ్డారు. వీరిలో 227 మంది టూ-వీలర్ డ్రైవర్లు, 39 మంది కార్ డ్రైవర్లు, 9 మంది త్రీ-వీలర్, 8 మంది భారీ వాహన డ్రైవర్లు ఉన్నారు. పట్టుబడిన వారందరినీ కోర్టులో హాజరుపరుస్తామని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి. హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనం నడిపి ప్రాణాంతక ప్రమాదాలకు కారణమైతే, భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ సెక్షన్ ప్రకారం గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తామని, ఈ స్పెషల్ డ్రైవ్‌లు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.