prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 6:13 pm Digital Edition : PRAJA KSHETRAM

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కొనసాగించాలి: మంద కృష్ణ మాదిగ

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కొనసాగించాలి: మంద కృష్ణ మాదిగ

హైదరాబాద్, జూన్ 29(ప్రజాక్షేత్రం):మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు కల్పించిన భద్రతను తగ్గించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, హోంమంత్రి రేవంత్‌రెడ్డికి సోమవారం బహిరంగ లేఖ రాశారు. డా. ప్రవీణ్‌కుమార్‌కు ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు లేకుండానే భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని తిరిగి అప్పగించాలని పోలీసు అధికారులు ఆదేశించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. గతంలో ఐపీఎస్ అధికారిగా పనిచేసిన సమయంలో తీవ్రవాదులు, ఫ్యాక్షన్ వర్గాలు, అసాంఘిక శక్తుల నుంచి పలుమార్లు ప్రాణహాని ఎదురైందని, అందువల్లే ఆయనకు ఎక్స్‌ కేటగిరీ భద్రత, బుల్లెట్‌ప్రూఫ్ వాహనం కల్పించారని గుర్తుచేశారు. దేశ సేవలో 26 సంవత్సరాలు పనిచేసి రాష్ట్రపతి పోలీస్ గ్యాలంట్రీ పతకంతో పాటు పలు పురస్కారాలు అందుకున్న అధికారికి భద్రత తొలగించడం వల్ల భవిష్యత్తులో నిజాయితీగా పనిచేసే అధికారుల్లో ఆందోళన నెలకొంటుందని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకే భద్రత తొలగించే ప్రయత్నం జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేశారు. డా. ప్రవీణ్‌కుమార్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ఏదైనా హాని జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, ఆయనకు ఎక్స్‌ కేటగిరీ భద్రతతో పాటు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని కొనసాగించాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.