prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 5:02 pm Digital Edition : PRAJA KSHETRAM

ఆస్తి కోసం రక్తసిక్తం చేసిన బంధం..!

ఆస్తి కోసం రక్తసిక్తం చేసిన బంధం..!

  • తల్లితో పాటు ముగ్గురి హత్యకు కూతురు-అల్లుడే సూత్రధారులు
  • నల్లగొండలో నాలుగు హత్యల కేసు మిస్టరీ వీడింది
  • కోట్ల ఆస్తి కోసం కిరాయి హంతకులతో కుటుంబాన్ని మట్టుబెట్టిన దారుణం.

నల్లగొండ జూన్ 25(ప్రజాక్షేత్రం):జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యుల హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చడమే కాకుండా, కుటుంబంలోని మరో ముగ్గురిని కూడా అత్యంత దారుణంగా హత్య చేయించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మృతురాలు హసీనా సొంత కూతురు, అల్లుడే ఈ హత్యల వెనుక ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
సాగర్ రోడ్డులోని తెలంగాణ కాలనీలో నివాసం ఉంటున్న మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీనా (40), కుమారుడు ముజమిల్ (20), కుమార్తె అక్సర (11)లు తమ ఇంట్లోనే హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నలుగురు రౌడీషీటర్లతో ఈ హత్యలు చేయించినట్లు పోలీసులు గుర్తించారు.

కోట్ల ఆస్తిపై కన్నేసి పన్నిన పక్కా ప్లాన్

హసీనా పేరిట కోటి రూపాయలకు పైగా విలువైన స్థలాలు, ఇళ్లు ఉండటంతో వాటిని తమ పేరున రాయించుకోవాలని కూతురు, అల్లుడు భావించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే హసీనా తన మూడో భర్త సుల్తాన్ పిల్లలైన ముజమిల్, అక్సర పేర్లపై వీలునామా రాయాలని నిర్ణయించుకోవడంతో కక్ష పెంచుకున్న నిందితులు హత్యలకు పథకం రచించినట్లు తేలింది.

11 ఏళ్ల చిన్నారి ప్రాణాల కోసం పోరాడినా కరుణించని హంతకులు

పోస్టుమార్టం నివేదికలో భయానక విషయాలు వెలుగుచూశాయి. సుల్తాన్ శరీరంపై ఆరు కత్తిపోట్లు, హసీనాపై ఏడు, అక్సరపై తొమ్మిది, ముజమిల్‌పై 16 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. హంతకుల భయంతో 11 ఏళ్ల అక్సర మంచం కింద దాక్కున్నప్పటికీ, ఆమెను బయటకు లాగి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కన్నతల్లినే కడతేర్చిన కూతురు.. షాక్‌లో ప్రజలు

తల్లి, సవతి తండ్రి, ఇద్దరు పిల్లలను ఒకేసారి హత్య చేయించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. ఆస్తి కోసం రక్త సంబంధాలను కూడా మరిచి ఈ ఘాతుకానికి పాల్పడిన తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.