ఐపీఎల్ హిస్టరీలోనే ‘వైభవం’ -15 ఏళ్ల కుర్రాడి చేతికి ఆరెంజ్ క్యాప్!
* టాప్ స్కోరర్‌గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
* ఒకే సీజన్‌లో ఆరెంజ్ క్యాప్, MVP, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుల క్లీన్ స్వీప్
* 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు.. సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు
నేషనల్ బ్యూరో జూన్ 01(ప్రజాక్షేత్రం):వయసు కేవలం 15 ఏళ్లే.. కానీ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన క్రికెట్ లీగ్‌ను తన బ్యాటింగ్ పవర్‌తో వణికించాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) ఓపెనర్, బీహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారించి చరిత్ర పుటల్లో కెక్కాడు. నిన్న రాత్రి (మే 31) అహ్మదాబాద్‌లో ముగిసిన 19వ టాటా ఐపీఎల్ ముగింపు వేడుకలు పూర్తిగా ఈ బుడ్డోడి పేరుతోనే సాగాయి. గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్ (732 పరుగులు), సాయి సుదర్శన్ (722 పరుగులు) ఫైనల్లో విఫలం కావడంతో, అత్యధిక పరుగుల వీరుడిగా వైభవ్ ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.
*రికార్డుల విధ్వంసం.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు!*
ఈ సీజన్‌లో వైభవ్ బ్యాటింగ్ చేసిన శైలి ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పై కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లతో 97 పరుగులు, అంతకుముందు మరో మ్యాచ్‌లో 37 బంతుల్లోనే 103 పరుగులతో విరుచుకుపడి లీగ్‌లోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 72 సిక్సర్లు బాది ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డును(59 సిక్సర్లు) సైతం వైభవ్ అధిగమించాడు.
*సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే?*
వైభవ్ అసాధారణ ప్రతిభను చూసి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. “సూర్యవంశీ కేవలం బంతిని బలంగా బాదడం లేదు, అతని మణికట్టు కదలికలు అద్భుతం. పిచ్‌పై బంతి పడే లైన్ అండ్ లెంగ్త్‌ను మిగతా వారి కంటే ముందే గుర్తిస్తున్నాడు. అతను చాలా స్పెషల్ ప్లేయర్” అని సచిన్ కొనియాడారు.
*ఒకే సీజన్.. ఐదు అవార్డులు!*
ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP) మరియు బెస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. నిన్నటి అవార్డుల ప్రదానోత్సవంలో బిసిసిఐ సెక్రటరీ జై షా పక్కన కూర్చుని మ్యాచ్ వీక్షించిన వైభవ్, అవార్డులతో పాటు ఒక బ్రాండ్ న్యూ టాటా సియెర్రా కారును సైతం బహుమతిగా అందుకున్నాడు.