prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 7:01 pm Digital Edition : PRAJA KSHETRAM

చిన్నారిపై దారుణానికి పాల్పడిన తండ్రీకొడుకులకు యావజ్జీవ శిక్ష

చిన్నారిపై దారుణానికి పాల్పడిన తండ్రీకొడుకులకు యావజ్జీవ శిక్ష

– కామాంధులకు కోర్టు గట్టి గుణపాఠం

– బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం

కుత్బుల్లాపూర్ జూన్ 05(ప్రజాక్షేత్రం):ఏడేళ్ల చిన్నారిపై దారుణ లైంగిక దాడి చేసిన ఇద్దరు నిందితులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైం నంబర్ 690/2023 కేసులో నిందితులు శివకుమార్, అతని కుమారుడు సామ్యూల్‌లకు ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించింది. ముత్యం రెడ్డి సైబరాబాద్ క్రైమ్స్ డిసిపి వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా ప్రాంతానికి చెందిన శివకుమార్, అతని కుమారుడు సామ్యూల్ ప్రస్తుతం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో నివాసం ఉంటున్నారు. 2023 ఆగస్టు 10న చిన్నారి తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా, ఇంట్లో ఉన్న ఏడేళ్ల బాలికను పొరుగింటివారైన శివకుమార్, సామ్యూల్ తమ ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక తీవ్ర నొప్పితో ఏడుస్తూ జరిగిన విషయాన్ని తెలిపింది. అనంతరం బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆగస్టు 12న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం పూర్తి ఆధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, విచారణ అనంతరం మేడ్చల్ ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు నిందితులను దోషులుగా తేల్చింది. బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నిందితులకు శిక్షపడే విధంగా శ్రమించిన పోలీస్ అధికారులను డిసిపి అభినందించారు.