prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 7:05 pm Digital Edition : PRAJA KSHETRAM

చెట్టు నుంచి దింపిన తాజా కల్లు రుచి చూసిన చంద్రబాబు.

చెట్టు నుంచి దింపిన తాజా కల్లు రుచి చూసిన చంద్రబాబు.

  • కాకినాడ జిల్లాలో కల్లుగీత కార్మికుడి ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు.
  • పోలరపు సింహాచలం అనే కార్మికుడికి స్వయంగా పింఛను అందజేత.
  • కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించాలని అధికారులకు ఆదేశం.
  • గీత కార్మికుల కష్టాలు తెలుసుకుని తాటికల్లు రుచిచూసిన సీఎం.

కాకినాడ జిల్లా జూన్ 01(ప్రజాక్షేత్రం):ముఖ్యమంత్రి చంద్రబాబు ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నారు. సోమవారం కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో పర్యటించిన ఆయన, కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి స్వయంగా వెళ్లారు. ఆయనకు రావాల్సిన పింఛనును చేతికి అందించి ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా సింహాచలం కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం, వారి జీవన విధానం గురించి ఆరా తీశారు. అత్యంత శ్రమతో కూడిన కల్లుగీత వృత్తిలోని కష్టనష్టాలు, ఆదాయం వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో, తమకు సొంత ఇల్లు లేదని సింహాచలం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, ఆయన తక్షణమే స్పందించారు. ఆ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. అనంతరం, తాటి చెట్టు నుంచి కల్లు తీసే విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. గీత కార్మికులు అప్పుడే తీసిన తాజా తాటి కల్లును రుచి చూశారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను, ఫొటోలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. పేద ప్రజల సంక్షేమమే తన ప్రభుత్వ లక్ష్యమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.