prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 9:38 am Digital Edition : PRAJA KSHETRAM

జంతర్ మంతర్ వ‌ద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ధర్నా

జంతర్ మంతర్ వ‌ద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ధర్నా

  • జంతర్ మంతర్‌లో నిరసనకు పోలీసుల అనుమతి
  • ఢిల్లీ చేరుకున్న పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే
  • మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
  • కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఢిల్లీ పోలీస్‌

న్యూ ఢిల్లీ జూన్ 06(ప్రజాక్షేత్రం):సోషల్ మీడియాలో ఆదరణ సంపాదించుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న నిరసనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. నీట్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించేందుకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే శనివారం ఉదయం అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. తొలుత పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవాలని భావించినా అనుమతి రావడంతో కార్యకర్తలంతా నేరుగా జంతర్ మంతర్‌కే రావాలని అభిజిత్ పిలుపునిచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చిన అభిజిత్ దిప్కే.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆత్మకథ ప్రతిని చేతిలో పట్టుకుని మీడియాకు కనిపించారు. ఈ నిరసన నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు నిరసన వేదిక వద్ద దాదాపు 2,000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని, సాయుధ బలగాలను మోహరించారు. విద్యాశాఖలో జవాబుదారీతనం, విద్యార్థులకు న్యాయం జరగాలనే ప్రధాన లక్ష్యంతోనే ఈ నిరసనలకు పిలుపునిచ్చినట్లు పార్టీ పంపిణీ చేసిన కరపత్రాల్లో పేర్కొంది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ తాము ఆన్‌లైన్‌లో పెట్టిన పిటిషన్‌కు ఇప్పటికే 8 లక్షలకు పైగా డిజిటల్ సంతకాలు వచ్చాయని వెల్లడించారు.