జీవో-111 సడలింపుల దిశగా అడుగులు..
- రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మళ్లీ ఊపు.
- 84 గ్రామాల్లో అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్?..
- పెట్టుబడిదారుల దృష్టి పశ్చిమ హైదరాబాద్‌పై.
రంగారెడ్డి జిల్లా జూన్ 23(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ మహానగర శివార్లలోని జీవో-111 పరిధిలో ఉన్న 84 గ్రామాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం లేదా భారీగా సడలింపులు ఇవ్వడంపై ఉన్నత స్థాయి కమిటీ నివేదికలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ ప్రాంతాల్లో కొత్త జోనింగ్ విధానాల ద్వారా గృహ, వాణిజ్య నిర్మాణాలకు అవకాశం కల్పించే ప్రతిపాదనలపై సచివాలయంలో చర్చలు జరుగుతున్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరక్షణకు భంగం కలగకుండా ఆధునిక మురుగునీటి శుద్ధి వ్యవస్థలు, ప్రత్యామ్నాయ డ్రైనేజీ నెట్‌వర్క్ ఏర్పాటు చేయడంతో పాటు 1.32 లక్షల ఎకరాల పరిధిలో కేవలం 10 శాతం భూమిలో మాత్రమే గ్రీన్ బిల్డింగ్స్, విల్లా ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి, మిగిలిన ప్రాంతాన్ని గ్రీన్ జోన్‌గా కొనసాగించే ప్రతిపాదనలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం.
పశ్చిమ హైదరాబాద్‌లో మళ్లీ జోరు
ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూల సంకేతాలు రావడంతో చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్ ప్రాంతాల్లో భూముల లావాదేవీలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ఐటీ కారిడార్‌కు సమీపంలోని వట్టినాగులపల్లి, ఖానాపూర్, జన్వాడ, అజీజ్‌నగర్ ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు, ఫామ్‌ల్యాండ్లపై దేశీయ, ఎన్నారై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే హైడ్రా చెరువులు, ఎఫ్‌టీఎల్ భూముల ఆక్రమణలపై కఠిన నిఘా కొనసాగిస్తుండటంతో, భూముల హద్దులు స్పష్టంగా ఉన్న వెంచర్లకే కొనుగోలుదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా జీవో-111 సడలింపుల ఉత్తర్వులు జారీ చేస్తే పశ్చిమ హైదరాబాద్ ప్రాంతం దేశంలోనే ప్రముఖ ఎకో-ఫ్రెండ్లీ రియల్ ఎస్టేట్ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని క్రెడాయ్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.