prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 3:52 pm Digital Edition : PRAJA KSHETRAM

పవర్ Vs ఫారెస్ట్: మెదక్ జిల్లాలో నడిరోడ్డుపై కొట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగులు!

పవర్ Vs ఫారెస్ట్: మెదక్ జిల్లాలో నడిరోడ్డుపై కొట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగులు!

మెదక్ జిల్లా ప్రతినిధి జూన్ 13(ప్రజాక్షేత్రం):తమ విధి నిర్వహణలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు నడిరోడ్డుపై వీధి రౌడీల్లా కొట్టుకున్న ఘటన మెదక్ జిల్లాలో కలకలం రేపింది. పని పట్ల తమకున్న ‘విధేయతను’ చాటుకునే క్రమంలో విద్యుత్, అటవీ శాఖల సిబ్బంది పరస్పరం దాడులకు దిగారు.

  • అసలేం జరిగిందంటే..

మెదక్ జిల్లాలోని సర్ధనగేట్ నుండి బూరుగుపల్లి వెళ్లే మార్గంలో విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు లైన్‌మెన్, ఇతర విద్యుత్ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే, తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా అటవీ ప్రాంతంలోని చెట్లను ఎలా నరుకుతారంటూ ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకుని విద్యుత్ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదం చోటుచేసుకుంది. మాటా మాటా పెరగడంతో ఇరు శాఖల సిబ్బంది సహనం కోల్పోయారు. ఒకరినొకరు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ, నడిరోడ్డుపైనే పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి, సమన్వయంతో పనిచేయాల్సిన సిబ్బంది ఇలా నడిరోడ్డుపై కొట్టుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.