prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 3:27 pm Digital Edition : PRAJA KSHETRAM

ప్రమాదం కేసుతో యువకుడి భవిష్యత్తు ప్రశ్నార్థకం

ప్రమాదం కేసుతో యువకుడి భవిష్యత్తు ప్రశ్నార్థకం

  • రోడ్డు ప్రమాదం…హత్యాయత్నం కేసు..ఎస్పీకి తండ్రి ఫిర్యాదు.
  • పెద్దేముల్ పోలీసుల తీరుపై ఎస్పీకి తండ్రి ఫిర్యాదు.
  • కేసు నమోదు విధానంపై ప్రశ్నలు.. ఎస్పీని ఆశ్రయించిన కుటుంబం.
  • ప్రమాద ఘటనను హత్యాయత్నంగా మార్చారంటూ ఆరోపణలు.
  • ఫిర్యాదులో రాసి ఇచ్చిన అంశాలను బట్టే కేసు నమోదు చేశాం.
  • వివరణలో తెలిపిన పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్.

పెద్దేముల్, జూన్ 13(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ యువకుడి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాధారణ ప్రమాద ఘటనను హత్యాయత్నం కేసుగా నమోదు చేసి రిమాండ్‌కు పంపడంతో ఉద్యోగ అవకాశం కోల్పోయాడని ఆరోపిస్తూ బాధితుడి తండ్రి మర్పల్లి శ్రీనివాస్ వికారాబాద్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన మర్పల్లి శ్రీనివాస్ కుమారుడు అనిర్వేష్ (20) ఈ నెల 2న స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన బుల్లెట్ మోటార్ సైకిల్ ఢీకొట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ కిందపడగా, బుల్లెట్ నడుపుతున్న జాఫర్ చేతికి స్వల్ప గాయం, ఫ్రాక్చర్ అయినట్లు పేర్కొన్నారు.ఈ ఘటనపై జాఫర్ సోదరుడు మోయిజ్ ఫిర్యాదు చేయగా, పూర్తి స్థాయి విచారణ చేపట్టకుండానే అనిర్వేష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఈ నెల 8న రిమాండ్‌కు పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదని, సాధారణ రోడ్డు ప్రమాదమేనని వివరించినప్పటికీ పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. రిమాండ్ కారణంగా ఈ నెల 9న జరగాల్సిన పోస్టల్ శాఖ ఉద్యోగ ఇంటర్వ్యూకు అనిర్వేష్ హాజరుకాలేకపోయాడని, దీంతో అతని ఉద్యోగ అవకాశం చేజారిందని కుటుంబ సభ్యులు వాపోయారు. ఒక కేసు కారణంగా యువకుడి విద్య, ఉద్యోగ భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు గాయపడిన జాఫర్, ఫిర్యాదుదారుడు మోయిజ్, వారి కుటుంబ సభ్యులు కూడా ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన మాత్రమేనని చెబుతున్నారని బాధితుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అవసరమైతే వారిని అధికారుల ఎదుట హాజరుపరచడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో పెద్దేముల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ వ్యవహారశైలిపై నిష్పాక్షిక విచారణ జరిపి, కేసు నమోదు, దర్యాప్తు, రిమాండ్ ప్రక్రియలో ఏవైనా లోపాలు జరిగి ఉంటే సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీని మర్పల్లి శ్రీనివాస్ కోరారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ వివరణ

పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామానికి చెందిన మోయిజ్ తన తమ్ముడికి జరిగిన ప్రమాద ఘటన పై ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరిచిన అంశాలను బట్టే కేసు నమోదు చేయడం జరిగిందని పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ తన వివరణలో తెలిపారు.