prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 3:15 pm Digital Edition : PRAJA KSHETRAM

బహుజన తెలంగాణ నిర్మాణానికి సామాజిక న్యాయం, విద్య ప్రజాస్వామికరణ అవసరం: ప్రొ. సూరేపల్లి సుజాత

బహుజన తెలంగాణ నిర్మాణానికి సామాజిక న్యాయం, విద్య ప్రజాస్వామికరణ అవసరం: ప్రొ. సూరేపల్లి సుజాత

హైదరాబాద్, జూన్ 13(ప్రజాక్షేత్రం):కుల వ్యవస్థను ఛేదించకుండా సమాజంలో ఎలాంటి విప్లవాత్మక మార్పు సాధ్యం కాదని ప్రముఖ సామాజిక విశ్లేషకురాలు ప్రొ. సూరేపల్లి సుజాత అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రీడింగ్ సర్కిల్ మరియు విశ్వంభర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “బహుజన తెలంగాణ దిశగా: సామాజిక న్యాయం, అస్తిత్వం, భవిష్యత్తు” అనే అంశంపై శనివారం అబిడ్స్‌లోని పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో నిర్వహించిన ప్యానెల్ చర్చలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొ. సూరేపల్లి సుజాత మాట్లాడుతూ, భారతదేశంలో కులం అనేది సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలను ప్రభావితం చేసే ప్రధాన అంశమని పేర్కొన్నారు. కుల వివక్షను నిర్మూలించకుండా సమానత్వ సమాజ నిర్మాణం సాధ్యం కాదన్నారు. తెలంగాణలో సుమారు 21 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రధానంగా బహుజన వర్గాల విద్యార్థులే చదువుతున్నారని, అలాంటి సమయంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకమైనప్పటికీ, ఆ ఉద్యమం నుంచి బలమైన ప్రజా నాయకత్వం వెలువడకపోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. గతంలో ఓటర్లు పాలకులను ఎన్నుకునేవారని, ప్రస్తుతం పాలకులే ఓటర్లను ఎంచుకునే పరిస్థితి ఏర్పడిందంటూ ప్రభుత్వ విధానాలను ఆమె విమర్శించారు. విద్యను ప్రజాస్వామికరించడం ద్వారా మాత్రమే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణమైన తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విడుతలై చిరుతైగల్ కట్చి (విసికె) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. జిలకర శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణలో ప్రజాస్వామిక విలువలు రోజురోజుకు బలహీనపడుతున్న నేపథ్యంలో ఇటువంటి చర్చలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మరింత ప్రజాస్వామికంగా ఎలా తీర్చిదిద్దాలి, అంబేద్కర్ కలల తెలంగాణను ఎలా సాకారం చేయాలనే అంశాలపై సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు మరియు హైదరాబాద్ ముస్లింలు కలిసి ముందుకు నడిపించారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణకు ప్రత్యేకమైన సంస్కృతి, చరిత్ర ఉన్నాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆధిపత్య సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి పల్లికొండ మణికంఠ మోడరేటర్‌గా వ్యవహరించారు. బార్క్ ప్రతినిధులు అమిత్, సంతోష్, కౌస్తుభ, నిఖిల్, విశ్వంభర ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ అమర్ నాథ్ లింగంపల్లి, సిటీ కోఆర్డినేటర్ యశ్వంత్, రావణ్ రాకేష్ విసికె రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.