బెల్ట్ షాపులపై ఉక్కుపాదం.. ఆరు ఇళ్లకు కరెంట్ కట్
- మద్యపాన రహిత గ్రామంగా నష్కల్..
- బాండు రాస్తేనే విద్యుత్ పునరుద్ధరణ
వరంగల్ జూన్ 29(ప్రజాక్షేత్రం):జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో మద్యపాన నియంత్రణకు గ్రామపంచాయతీ కఠిన చర్యలు చేపట్టింది. గ్రామంలో రహస్యంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఆరుగురి ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిర్మూలించి, మద్యపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గతంలో నిర్వహించిన గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు సర్పంచ్ శాతబోయిన రాజు తెలిపారు. ఆ తీర్మానం ప్రకారమే అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారి ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగించినట్లు చెప్పారు. గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడవడం వల్ల యువత మద్యానికి బానిసవుతూ, కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై గ్రామంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే వారి రేషన్ కార్డు, విద్యుత్ కనెక్షన్‌తో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ సౌకర్యాలపై కూడా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హెచ్చరించారు. ప్రస్తుతం విద్యుత్ కనెక్షన్ కోల్పోయిన వారు ఇకపై గ్రామంలో మద్యం విక్రయించబోమని బాండు పేపర్‌పై లిఖితపూర్వక హామీ ఇస్తేనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని గ్రామపంచాయతీ వర్గాలు స్పష్టం చేశాయి.