prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 5:26 pm Digital Edition : PRAJA KSHETRAM

భారీగా తగ్గిన ముడిచమురు ధర..

భారీగా తగ్గిన ముడిచమురు ధర..

– అయినా తగ్గని పెట్రోల్, డీజిల్ ధరలు.. కారణాలివే

హైదరాబాద్ జూన్ 30(ప్రజాక్షేత్రం):అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గినా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు సగటు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం భారత క్రూడ్ ఆయిల్ బాస్కెట్ ధర బ్యారెల్‌కు 68.86 డాలర్లుగా నమోదైంది. అయితే ఈ తగ్గుదల ప్రయోజనం వినియోగదారులకు వెంటనే అందే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో అంతర్జాతీయ ధరలు భారీగా పెరిగిన సమయంలో చమురు మార్కెటింగ్ సంస్థలు ఎదుర్కొన్న నష్టాలను భర్తీ చేసుకోవాల్సి ఉండటం, వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం భరించిన ఆర్థిక వ్యయాన్ని సమతుల్యం చేయాల్సిన అవసరం ఉండటమే ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్ విక్రయాలపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్‌కు రూ.5–6 వరకు లాభం పొందుతుండగా, డీజిల్‌పై మాత్రం లీటర్‌కు రూ.8–10 వరకు నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
గతంలో ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అనంతరం చమురు కంపెనీలు కూడా ధరలను సవరించాయి. తాజాగా అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నప్పటికీ, దేశీయ ఇంధన ధరల్లో ఇప్పటివరకు ఎలాంటి మార్పు చేయలేదు. ఈ నేపథ్యంలో పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ, ప్రపంచ ఇంధన సంక్షోభ ప్రభావం నుంచి భారత వినియోగదారులను ప్రభుత్వం రక్షించిందని తెలిపారు. ఎక్సైజ్ సుంకం తగ్గింపు, ఇతర చర్యల ద్వారా కేంద్రంపై భారీ ఆర్థిక భారం పడినప్పటికీ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు.