రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మళ్లీ రెక్కలు!
శంకర్ పల్లి, జూన్ 23(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ మహానగర శివార్లలోని పర్యావరణ పరిరక్షణ జోన్ అయిన జీవో 111 పరిధిలోని 84 గ్రామాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో ఈ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం లేదా భారీగా సడలింపులు ఇచ్చే అంశంపై ఏర్పాటైన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ నివేదికలను ప్రభుత్వం సుదీర్ఘంగా పరిశీలిస్తోంది. దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ ప్రాంతాల్లో గృహ, వాణిజ్య నిర్మాణాలకు వీలుగా కొత్త జోనింగ్ నిబంధనలను తీసుకురావాలనే ప్రతిపాదనలపై సచివాలయ వర్గాల్లో ముమ్మర చర్చలు సాగుతున్నాయి. చారిత్రాత్మక జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వరద మార్గాలకు, పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా బ్యాలెన్స్ పాటించడంపై ఈ వారంలో ఉన్నతాధికారులు కీలక సమీక్షలు నిర్వహించారు. జలాశయాల్లోకి మురుగునీరు చేరకుండా ప్రత్యామ్నాయ డ్రైనేజీ నెట్‌వర్క్, అత్యాధునిక మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ 1.32 లక్షల ఎకరాల పరిధిలో కేవలం 10 శాతం విస్తీర్ణంలోనే గ్రీన్ బిల్డింగ్స్, లగ్జరీ విల్లా ప్రాజెక్టులకు అనుమతులిచ్చి, మిగిలిన 90 శాతం ల్యాండ్‌ను గ్రీన్ జోన్ లేదా కన్జర్వేషన్ జోన్‌గా ఉంచే వ్యూహంపై అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సానుకూల పరిణామాలతో పశ్చిమ హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన చేవెళ్ల, శంకర్ పల్లి, మొయినాబాద్ బెల్ట్‌లో ల్యాండ్ లావాదేవీలు అకస్మాత్తుగా ఊపందుకున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా ఇక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించినట్లు కనిపించినా, జీవో సడలింపుల వార్తలతో ఇన్వెస్టర్లు, పెద్ద పెద్ద డెవలపర్లు మళ్లీ వెంచర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలో ఉండే వట్టినాగులపల్లి, ఖానాపూర్, జన్వాడ, అజీజ్‌నగర్ వంటి గ్రామాల్లో ఓపెన్ ప్లాట్లు, ఫామ్‌ల్యాండ్స్ కొనుగోలుకు దేశీయ, ఎన్నారై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు.ఒకవైపు జీవో 111పై ప్రభుత్వ నిర్ణయం సానుకూలంగా వస్తున్నప్పటికీ, కొనుగోలుదారులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నగరంలో చెరువులు, ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఆక్రమణలపై హైడ్రా’ గట్టి నిఘా ఉంచడం, సీసీటీవీల ద్వారా లైవ్ మానిటరింగ్ చేస్తుండటంతో భూముల సరిహద్దుల విషయంలో స్పష్టత ఉన్న వెంచర్లకే మొగ్గు చూపుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా జీవో సడలింపుల ఉత్తర్వులు జారీ చేస్తే గనుక, ఈ ప్రాంతం హైదరాబాద్‌లోనే అతిపెద్ద ప్రీమియం అండ్ ఎకో-ఫ్రెండ్లీ రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా మారడం ఖాయమని క్రెడాయ్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.