ఇందుర్తిలో పోచమ్మ బోనాల వైభవం
విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా బోనాల మహోత్సవం
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం.. డప్పు చప్పుళ్లతో ఊరేగింపు..
ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిన ఇందుర్తి
చిగురుమామిడి, జూలై 19 (ప్రజాక్షేత్రం) : ఇందుర్తి గ్రామంలో విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పోచమ్మ బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పించగా, డప్పు చప్పుళ్లు, భక్తి గీతాల నడుమ గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి బోనాల ఊరేగింపు గ్రామ ప్రధాన వీధుల గుండా ఘనంగా సాగి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు జై పోచమ్మ తల్లి నినాదాలతో ఊరేగింపులో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో సుఖశాంతులు, సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.