prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 3:08 am Digital Edition : PRAJA KSHETRAM

ఎల్‌సీ ఉన్నా సప్లై ఆన్… విద్యుత్ షాక్‌తో కుప్పకూలిన యువకుడు

ఎల్‌సీ ఉన్నా సప్లై ఆన్… విద్యుత్ షాక్‌తో కుప్పకూలిన యువకుడు

  • విద్యుత్ స్తంభంపై పని చేస్తుండగా ఘోర ప్రమాదం.
  • ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బుద్దారం గ్రామానికి చేసిన యువకుడు బోయిని శ్రీనివాస్
  • విధుల నిర్లక్ష్యంపై పెద్దేముల్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఎండి.ఇస్మాయిల్ సస్పెన్షన్
  • విద్యుత్ నిర్లక్ష్యంపై బుద్దారం గ్రామస్తుల ఆగ్రహం
  • విద్యుత్ షాక్ ఘటనతో పెద్దేముల్‌లో ఉద్రిక్తత
  • బాధితుడికి న్యాయం చేయాలంటూ విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడించిన గ్రామస్తులు
  • మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి రంగ ప్రవేశంతో సద్దుమణిగిన వివాదం
  • విద్యుత్ అధికారులు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడంతో నిరసనను విరమించిన బుద్ధారం గ్రామస్తులు

పెద్దేముల్, జూలై 11(ప్రజాక్షేత్రం):విద్యుత్ స్తంభంపై మరమ్మతులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా ప్రారంభం కావడంతో ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని బుద్ధారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.ఈ ఘటన విద్యుత్ శాఖలో తీవ్ర కలకలం రేపగా, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సబ్‌స్టేషన్ ఆపరేటర్‌ను విద్యుత్ అధికారులు వెంటనే సస్పెండ్ చేశారు.పెద్దేముల్ విద్యుత్ ఏఈ రఘువీర్, బుద్దారం గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… బుద్ధారం గ్రామ బీసీ కాలనీలో రెండు విద్యుత్ స్తంభాల వద్ద ఏవీ కేబుల్ వైర్లు పిట్టగూడు కారణంగా అకస్మాత్తుగా కాలిపోవడంతో వీధి దీపాలు పనిచేయడం నిలిచిపోయింది.ఈ సమస్యను పరిష్కరించాలని విద్యుత్ కాంట్రాక్టర్ హనుమంతుకు ఏఈ రఘువీర్ ఆదేశించగా, లైన్‌మెన్ బోనప్పతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అనంతరం సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టర్ హనుమంతు ఎల్‌సీ (లైన్ క్లియర్) తీసుకున్న తర్వాత గ్రామానికి చెందిన బోయిన శ్రీనివాస్, బోయిన నవీన్‌లను విద్యుత్ స్తంభంపైకి ఎక్కించి మరమ్మతు పనులు చేపట్టించారు.ఈ సమయంలో ఎల్‌సీ ఇచ్చిన విషయాన్ని మరిచిపోయిన పెద్దేముల్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఎం.డి ఇస్మాయిల్ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో స్తంభంపై పని చేస్తున్న బోయిన శ్రీనివాస్ తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై విద్యుత్ స్తంభం పక్క భాగంలో ఉన్న ఓ రేకుల షెడ్డుపై పడి అక్కడి నుండి కిందపడిపోయాడు.ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా, మరో యువకుడు బోయిన నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి.గాయపడిన శ్రీనివాస్‌ను తొలుత తాండూర్‌లోని బాలాజీ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని డెక్కన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

పెద్దేముల్ విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ సస్పెన్షన్

ఈ ఘటనపై విద్యుత్ ఏఈ రఘువీర్ తాండూర్ డివిజన్ అధికారులకు నివేదిక అందించారు. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించి విద్యుత్ సరఫరా ప్రారంభించడం వల్ల ప్రమాదం జరిగిందని నిర్ధారించిన ఉన్నతాధికారులు సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఎం.డి ఇస్మాయిల్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకు విధుల్లో చేరడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు.

పెద్దేముల్ సబ్‌స్టేషన్ ముట్టడించిన బుద్దారం గ్రామస్తులు

ప్రమాద ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బుద్ధారం గ్రామస్తులు శుక్రవారం రాత్రి పెద్దేముల్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. బాధితుడు బోయిని శ్రీనివాస్‌కు న్యాయం చేయాలని,చికిత్సతో పాటు ఇతర ఖర్చులన్నింటినీ విద్యుత్ శాఖనే భరించాలని, శారీరకంగా విద్యుత్ షాక్ తో శ్రీనివాస్ దెబ్బ తిన్నాడని డిమాండ్ చేస్తూ సబ్‌స్టేషన్ ఎదుట గంటల తరబడి బైఠాయించి నిరసన చేపట్టారు.విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ.ప్రశాంత్ వర్ధన్ సంఘటన స్థలానికి చేరుకొని బుద్ధారం గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం పెద్దేముల్ విద్యుత్ ఏఈ రఘువీర్, తాండూర్ టౌన్ ఏఈ రఘువీర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బుద్దారం గ్రామస్తులకు చాలా సేపు సముదాయించి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి చొరవతో శాంతించిన బుద్దారం గ్రామస్థులు

తదుపరి బుద్దారం గ్రామస్థులు నిరసన తెలుపుతున్న సంఘటన స్థలానికి రాత్రి పూట చేరుకున్న పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి ముందుగా పెద్దేముల్ విద్యుత్ ఏఈ రఘువీర్, తాండూరు టౌన్ ఏఈ రఘువీర్ రెడ్దిలతో మాట్లాడి బాధితుడు బోయిన శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ కొన్ని గంటల పాటు సముదాయించారు జరిపారు. వారితో పాటు విద్యుత్ సబ్ స్టేషన్ లో కొన్ని గంటల పాటు కూర్చున్నారు.తమ సమస్య గురించి వేరే గ్రామాలకు విద్యుత్ సప్లై ని ఆపడం సరికాదని తెలిపారు.తదుపరి తాండూరు డివిజన్ విద్యుత్ ఏడీ శంకర్ నాయక్ తో ఫోన్ లో మాట్లాడి మీరు సంఘటన స్థలానికి రావాలని కోరారు. ఏడీ సంఘటన స్థలానికి వచ్చే వరకు వేచి ఉండి తదుపరి ఆయనతో మాట్లాడి, మరోమారు ఏడీతో బుద్ధారం గ్రామస్తులతో మాట్లాడించారు. తదుపరి ఏడి శంకర్ నాయక్ బుద్ధారం గ్రామస్తులకు బాధితుడు బోయిని శ్రీనివాస్ కు ఆసుపత్రి చికిత్స ఖర్చులను విద్యుత్ శాఖ భరిస్తుందని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడానికి పి.మహిపాల్ రెడ్డి సమక్షంలో ఒప్పుకొని బుద్ధారం గ్రామస్తులకు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడంతో బుద్ధారం గ్రామస్తులు శాంతించారు. అనంతరం కాసేపటి తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయారు.సుమారు శుక్రవారం రాత్రి 8 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు సుమారు 9 గంటల పాటు పెద్దేముల్ విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బాధితుడు బోయిని శ్రీనివాస్ కు న్యాయం చేయాలని సబ్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు 5 గంటలపాటు విద్యుత్ సబ్ స్టేషన్ లో కూర్చొని, బుద్ధారం గ్రామస్తులతో విద్యుత్ అధికారులతో మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకున్న పి.మహిపాల్ రెడ్డి వివాదం సద్దుమణిగేలా చొరవ చూపడంతో బుద్దారం గ్రామస్థులు శాంతించి అక్కడి నుండి వెళ్లిపోయారు. అనంతరం విద్యుత్ అధికారులు విద్యుత్ సిబ్బంది సహాయంతో సుమారు తొమ్మిది గంటల పాటు నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరాను అందించారు.

9 గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం….అల్లాడిపోయిన ఆయా గ్రామాల ప్రజలు

బుద్ధారం గ్రామంలో జరిగిన విద్యుత్ ప్రమాద ఘటనతో బుద్ధారం గ్రామస్తులు పలువురు బాధితుడు బోయిన శ్రీనివాస్ న్యాయం చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలుపడంతో సుమారు తొమ్మిది గంటల పాటు ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. 9 గంటలపాటు గ్రామాలన్నీ అంధకారంలో ఉండిపోయాయి. దీంతో ఆయా గ్రామాల్లో కరెంటు లేక చిన్నారులు ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుండి శనివారం తెల్లవారుజామున 4 గంటల వరకు విద్యుత్ సరఫరా కి అంతరాయం కలిగింది. తదుపరి వివాదం సద్దుమనుగడంతో విద్యుత్ అధికారులు సుమారు 9 గంటల తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

విద్యుత్ ప్రమాద ఘటనపై కొనసాగుతున్న విచారణ

బుద్ధారం గ్రామంలో జరిగిన విద్యుత్ ప్రమాద ఈ ఘటనపై అటు పోలీసులు, ఇటు విద్యుత్ శాఖ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రమాదం అసలు ఎలా చోటు చేసుకుంది? ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.